దేశీయ స్టాక్ మార్కెట్‌లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల క్రితం వరకు భారీగా నష్టపోయిన సూచీలు, నిన్న, నేడు (గురువారం, ఏప్రిల్ 21) భారీ లాభాలకి వచ్చాయి. ఆసియా మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల సందడి కనిపించింది. భారత్ గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తోందన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలు సెంటిమెంటును బలపరిచాయి. దీంతో సూచీలు పరుగు పెట్టాయి.

రూ.6 లక్షల కోట్లు జంప్
ఇన్వెస్టర్ల సంపద ఈ రెండు సెషన్‌లలోనే రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.3.6 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.271.9 లక్షల కోట్లకు పెరిగింది. క్రితం సెషన్‌లో రూ.268.2 లక్షల కోట్లుగా ఉంది. ముఖ్యంగా దిగ్గజ కంపెనీలైన రిలయన్స్, ఇన్ఫోసిస్, HDFC ట్విన్స్ భారీగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ త్రైమాసిక ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ అప్రమత్తంగా కదలాడింది.

అందుకే లాభాల్లో...
భారత్ గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఆశియా మార్కెట్ నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా ఇటీవలి భారీ కనిష్టానికి వెళ్లడంతో ఈ కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ ఓ సమయంలో 58,000 పాయింట్లకు తొమ్మిది పాయింట్ల దూరంలో కనిపించింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 57,037 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 874 పాయింట్లు లాభపడి 57,911 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 256 పాయింట్లు ఎగిసి 17,392 పాయింట్ల వద్ద ముగిసింది.

అన్ని రంగాలు లాభాల్ోనే
అన్ని రంగాలు కూడా నేడు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, పవర్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం నుండి 2 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున ఎగిశాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, టాటా స్టీల్, హిండాల్కో, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యు ఉన్నాయి.


Click it and Unblock the Notifications