6 సెషన్లలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
ఆర్బీఐ, ఫెడ్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఆర్థిక మాంద్యం భయాలు వంటి వివిధ కారణాల వల్ల గత వారంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా క్షీణించింది. గత ఆరు సెషన్‌లలో ఇన్వెస్టర్ల సంపద రూ.18 లక్షల కోట్లకు పైగా పతనమైంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.17.50 లక్షల కోట్లకు పైగా ఉంది. అంటే ఈ కంపెనీ ఎం-క్యాప్ కంటే ఎక్కువ క్షీణించింది.
గతవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా అంతకుముందువారం నుండి మొదలైన బేర్ పట్టు గతవారం కూడా కొనసాగింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా వరుసగా 6 ట్రేడింగ్ సెషన్‌లలో లక్షలకోట్ల సంపదను కోల్పోయారు. గత నెలలో అంటే మే నెలలో ఇన్వెస్టర్లు 16 శాతం సంపదను కోల్పోయారు.

అంతకుముందువారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ 30 సూచీ సెన్సెక్స్ 3,959 పాయింట్లు లేదా 7.15 శాతం నష్టపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాది కనిష్టస్థాయి 50,921కు పడిపోయింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుండి 17వ తేదీ వరకు ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణి కనిపిస్తోంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.18,17,747.13 కోట్లు క్షీణించి, రూ.2,36,77,816 కోట్లకు తగ్గింది.


Click it and Unblock the Notifications