ఒక్కరోజులో రూ.1.59 లక్షల కోట్ల సంపద ఆవిరి, 2 రోజుల్లో రూ.3.50 లక్షల కోట్లు..
ముంబై: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు పెరగడంతో అమెరికా, రష్యా, యూరోప్ దేశాల్లో మార్కెట్ల నష్టపోయాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలు మరోసారి లాక్ డౌన్ ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు, భారత మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 40వేల పాయింట్ల దిగువకు వచ్చింది. నిఫ్టీ 11,800 పాయింట్ల దిగువకు చేరుకుంది. నేడు భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. సెన్సెక్స్ 599.64 పాయింట్లు, నిఫ్టీ 157.70 పాయింట్లు పడిపోయింది.

రూ.1.59 లక్షల కోట్ల నష్టం
సెన్సెక్స్ 600 పాయింట్ల మేర నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. రూ.1.59 లక్షల కోట్ల సంపద ఈ ఒక్కరోజు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158.19 లక్షల కోట్లకు తగ్గింది. రెండు రోజుల క్రితం (సోమవారం) మార్కెట్ నష్టాల కారణంగా రూ.1.92 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మొన్న, ఇవాళ.. ఈ రెండు రోజుల్లో రూ.3.50 లక్షల కోట్లకు పైగా సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. అయితే నిన్న మాత్రం లాభాలు వరించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, అమెరికా ఎన్నికలు, ప్యాకేజీపై గందరగోళం ప్రపంచ మార్కెట్ దిశను మార్చాయని, ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ మందగిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రధానంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఫైనాన్షియల్ స్టాక్స్ ఎక్కువగా దెబ్బతీశాయి.

52 వారాల గరిష్టం...
995 షేర్లు లాభాల్లో ముగియగా, 1627 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 88 సెక్యూరిటీస్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఇందులో ఎక్కువగా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. 47 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 215 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లిమిట్స్‌ను తాకగా, 224 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జర్మనీ మార్కెట్లు 3 శాతం, ఫ్రాన్స్ మార్కెట్ 2.55 శాతం నష్టపోయాయి. కోస్పీ, షాంఘై కాంపోజిట్ మినహా అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

FPIలు ఇన్వెస్ట్
ఇక, నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ.3,515 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీఫండ్స్(DII) రూ.1,571 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించాయి. సోమవారం FPIలు రూ.119.4 కోట్లు, DIIలు రూ.979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి.


Click it and Unblock the Notifications