Adani Shares: అదానీపై రిపోర్టు విశ్వసనీయమైనదే.. నోరు విప్పిన బిలియనీర్ ఇన్వెస్టర్
Adani Shares: ఒకే ఒక్క రిపోర్ట్ అదానీ గ్రూప్ కంపెనీలపై పెద్ద పిడుగులా పడింది. దీంతో అదానీ లిస్టెడ్ కంపెనీల విలువ దాదాపు 20 శాతం వరకు పతనమైంది. ప్రపంచ కుబేరుడికి గతంలో బుక్ రన్నింగ్ ఆరోపణల నేపథ్యంలో ఒకసారి షేర్ల భారీ పతనం జరగగా.. ఇప్పుడు అమెరికా సంస్థ రీసెర్చ్ రిపోర్టు వెలుగులోకి రావటంతో మరోసారి షేర్ల పతనం కొనసాగుతోంది. పైగా దీనిపై హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది.
అతిపెద్ద FPO..
ఈ రోజు తెరవబడుతున్న అదానీ గ్రూప్ ఎఫ్పీవోకు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. నేటి నుంచి జనవరి 31 వరకు తెరచి ఉండే ఈ ఎఫ్పీవో ద్వారా గ్రూప్ రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అదానీ ఎంటర్ ప్రైజెస్ ఒక్కో షేరు ధర మార్కెట్లో రూ.3,405 వద్ద ఉంది.
బిలియనీర్ ఇన్వెస్టర్ మాట..
అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ విడుదల చేసిన ఫారెన్సిక్ రీసెర్చ్ రిపోర్ట్ గురించి ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ విలియం అక్‌మాన్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. హిండెన్‌బర్గ్ రూపొందించిన రిపోర్ట్ అత్యంత విస్వసనీయమైనదంటూ అది చాలా లోతుగా పరిశోధించబడినదని అన్నారు.
తాను అదానీ కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను చేస్తున్న కామెంట్స్ పూర్తిగా రిపోర్టు, అదానీ రెస్పాన్స్ ఆధారంగా చేస్తున్నవని చెప్పుకొచ్చారు.

రాజకీయ రంగు పులుముకుని..
అంతర్జాతీయ సంస్థ భారత వ్యాపార దిగ్గజంపై చేసిన ఆరోపణల రిపోర్ట్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాలు సైతం ఇప్పుడు ఈ విషయాన్ని మోదీకి వ్యతిరేకంగా ఆయుధంగా మార్చుకునే పనిలో పడ్డాయి. అదానీ గ్రూప్ పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై RBI, SEBIలతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలు రిస్క్ లో పడకుండా లిబరల్ ఇన్వెస్టిగేషన్ జరపాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు.

అయోమయంలో ఇన్వెస్టర్లు..
వివాదం రోజురోజుకూ చిలికి చిలికి పెద్ద గాలివానగా మారుతున్న తరుణంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అటు రీసెర్చ్ సంస్థ, ఇటు అదానీ గ్రూప్ రెండూ వెనక్కి తగ్గేటట్లు కనిపించటం లేదు. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఆవిరైంది. అయితే ఈ పతనం ఎంత వరకు కొనసాగుతుందనే విషయం చాలా మంది ఇన్వెస్టర్లను అయోమయంలోకి నెడుతోంది. దీంతో నష్టాలకైనా అదానీ షేర్లను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపుతున్నారు.


Click it and Unblock the Notifications