మూడ్రోజుల్లో రూ.9.41 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్లు వరుసగా లాభపడటంతో గత మూడు రోజుల్లోనే ఇన్వెస్టర్ల ఆదాయం రూ.9.41 లక్షల కోట్లు పెరిగింది. వరుసగా మూడో సెషన్లో సూచీలు పైపైకి చేరుకున్నాయి. సెన్సెక్స్ నేడు 1148 పాయింట్లు ఎగిసి 51,000 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్లు ఎగబాకి 15200 పాయింట్లకు చేరుకుంది. 30 షేర్ సెన్సెక్స్ 1147.76 పాయింట్లు లేదా 2.28 శాతం ఎగిసి 51,445 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఫిబ్రవరి 2వ తేదీ నుండి బిగ్గెస్ట్ సింగిల్ డే లాభం ఇదే. ఇక నిఫ్టీ 326 పాయింట్లు లేదా 2.19 శాతం లాభపడి 15,245 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ రోజు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,69,170 కోట్లు పెరిగి రూ.2,10,22,227 కోట్లకు చేరుకుంది. మార్చి ఒకటవ తేదీ నుండి అంటే ఈ మూడు సెషన్లలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.9.41 లక్షల కోట్లు పెరిగి రూ.2,10,22,227 కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో సెన్సెక్స్ 2344 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 716 పాయింట్లు ఎగిసింది.

ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో కనిపించాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పైన కనిపించింది. స్పెక్ట్రం వేలం ముగిసిన నేపథ్యంలో టెలికం షేర్లు భారీగా పుంజుకుంటాయని ముందే అంచనా వేశారు. బడ్జెట్ అనంతరం సూచీలు భారీగా ఎగిసి, ఆ తర్వాత నష్టపోయాయి. ఓ సమయంలో 52వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాల్లోకి వెళ్లింది. తిరిగి పుంజుకొని, ఇప్పుడు 51వేలు దాటి, 52వేల దిశగా వెళ్తోంది.


Click it and Unblock the Notifications