Market Next Week: బడ్జెట్ 2024పైనే అందరి చూపు.. మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే..!
Market Week Ahead: గడచిన వారంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్లు గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో వారాంతంలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీ నష్టాల మధ్య తమ ప్రయాణాన్ని ముగించాయి.
అయితే ఈ వారం దేశంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూనియన్ బడ్జెట్ ఎట్టకేలకు దగ్గరపడింది. ఇప్పటి వరకు బుల్ రన్ మార్కెట్లను బలంగా నడిపించిన సంగతి తెలిసిందే. అయితే జూలై నాల్గవ వారంలో పెట్టుబడిదారులు ఏదైనా యూనియన్ బడ్జెట్-సంబంధిత లేదా ప్రభుత్వ విధాన ప్రకటనలను ఆసక్తిగా గమనిస్తారు. అవి కొన్ని స్టాక్‌లలో మూమెంట్‌ను ప్రేరేపిస్తుంది. అలాగే ఏప్రిల్-జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు, దేశీయ-ప్రపంచ స్థూల ఆర్థిక డేటా, కార్పొరేట్ ప్రకటనలు, విదేశీ నిధుల ప్రవాహం, ముడి చమురు ధరలు, ప్రపంచ సంకేతాలు ఈవారం మార్కెట్ కదలికను పెంచుతాయి.

వరుసగా ఏడు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు తమ లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అయితే మునుపటి సెషన్‌లో తీవ్ర పతనం వారాంతంలో గత లాభాలను తొలగించింది. అలాగే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరికరాలు క్రాష్‌కు కారణమైన అంతరాయం కారణంగా అనేర రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు నష్టాల పాలయ్యాయి. Q1FY25లో బలమైన పనితీరు, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుకు సంబంధించిన అంచనాలతో మార్కెట్లు ఉత్సాహంగా ఉంది. గతవారం దేశీయ ఐటీ కంపెనీల బలమైన కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. అలాగే బ్యాంకింగ్ కంపెనీలు సైతం ఊహించని రీతిలో బలమైన పనితీరును ఫలితాల్లో ప్రదర్శించాయి.
అలాగే రానున్న వారంలో ఐపీవోల రష్ కూడా మార్కెట్లను తాకనుంది. ఈ క్రమంలో 8 కొత్త ఐపీవోలతో పాటు 8 ఐపీవోల లిస్టింగ్ మార్కెట్లను తాకనుంది. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గతవారం తమ కొనుగోళ్లను పొడిగిస్తూ రూ.10,946 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అలాగే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,226 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా తమ కొనుగోలు పరంపరను కొనసాగించి ఈ నెలలో ఇప్పటివరకు రూ.30,772 కోట్ల ఈక్విటీలను పంప్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను గమనిస్తే యూఎస్ మార్కెట్లు కూడా బలమైన ఉప్పెన తర్వాత లాభాల స్వీకరణకు గురవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి చూపు జూలై 23న భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైనే ఉంది.


Click it and Unblock the Notifications