అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోయాయి. బులియన్ మార్కెట్లలో బలహీనత ప్రభావంతో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. సోమవారం ఆల్‌టైమ్ హై అయిన రూ. 1,02,000 మార్క్‌ను అధిగమించిన తర్వాత 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి.MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,295 లేదా 1.27 శాతం తగ్గి ఇంట్రాడే కనిష్ట స్థాయి నమోదుతో రూ. 1,00,503కు చేరింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. MCX వెండి ఫ్యూచర్స్ 1.59 శాతం తగ్గి కిలోకు రూ. 1,13,047కు చేరుకుంది.
గత వారం MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,02,250 దాకా పెరిగింది. దీనికి రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయ స్థూల ఆర్థిక ఆందోళనలు పెరగడం, సురక్షిత ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం పై ఆశలు పెరగడం, ముఖ్యంగా ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సమావేశం జరగబోతుందన్న ప్రకటనతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దారి తీసాయి.

రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు బంగారం డిమాండ్‌ను పెంచుతున్నాయి. దేశీయ ఆభరణాల డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, సురక్షిత పెట్టుబడుల కోసం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత స్థాయిలు పాక్షిక లాభాల బుకింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. అక్టోబర్ ఫ్యూచర్స్ కోసం MCX Gold ధర రాబోయే 2-3 నెలల్లో రూ. 96,000 - రూ. 92,000 వరకు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే.. ఈ ఏడాది బంగారం ర్యాలీకి కారణమైన అంశాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్-పుతిన్ సమావేశం ప్రకటనతో ఉక్రెయిన్ యుద్ధంపై భౌగోళిక ఆందోళనలు తగ్గాయి. వచ్చే ఏడాది US రేటు కోతలు నిలిచిపోవడం, డాలర్ సూచిక స్థిరీకరణ, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్ల వేగం తగ్గడం కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. బంగారం ఇప్పటికే ఓవర్‌బాట్ జోన్‌లో ఉంది. కాబట్టి రానున్న కాలంలో MCX బంగారం ధరలు రూ. 96,500 - రూ. 97,600 వరకు పడే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుత పెరిగిన ధరల వద్ద బంగారంలో పాక్షిక లాభాల బుకింగ్ పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ రిస్క్ ప్రీమియంలు తగ్గడం, కీలకమైన బుల్లిష్ డ్రైవర్లు బలహీనపడటం వంటి అంశాలు మార్కెట్‌లో స్వల్పకాలిక ఒత్తిడిని సృష్టించవచ్చు అని చెబుతున్నారు. బంగారంలో దశల వారీగా పెట్టుబడుల పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications