బడ్జెట్‌కు ఇవి జత కలిసి... 6 రోజుల్లోనే రూ.16.70 లక్షల కోట్లు వచ్చాయి
ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుండి మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. బడ్జెట్‌కు ముందు వరుసగా ఆరు రోజుల పాటు మార్కెట్లు నష్టపోయి రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బడ్జెట్‌కు ముందు 46,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్, ఇప్పుడు 51,000 దాటింది. 5వేల పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 13వేల స్థాయి నుండి 15వేలు క్రాస్ చేసింది. బడ్జెట్ నుండి వరుసగా ఆరు సెషన్లు భారీ లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది.

బడ్జెట్‌కు ఇవి జత
సూచీలు ఆరో రోజు భారీగా ఎగిశాయి. సెన్సెక్స్ 51,000 పాయింట్లను, నిఫ్టీ 15,000 పాయింట్లను దాటింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద సోమవారం ఒక్కరోజే రూ.2.50 లక్షల కోట్లు పెరిగింది. బడ్జెట్ ప్రకటనకు తోడు వివిధ అంశాలు మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. కంపెనీల ఆకర్షణీయ క్వార్టర్ ఫలితాలు, విదేశీ పెట్టుబడుల రాక కలిసి వచ్చింది. డాలర్ మారకంతో రూపాయి నిన్న 4 పైసలు తగ్గి రూ.72.97 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, టోక్యో, హాంగ్‌కాంగ్, సియోల్ నష్టపోయాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ముగిశాయి.

16.70 లక్షల కోట్లు పెరిగిన సంపద
వరుసగా ఆరు రోజులు మార్కెట్లు లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.16.70 లక్షల కోట్లు (16,70,154.05) పెరిగింది. సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.2.50 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.202.82 లక్షల కోట్లకు (2,02,82,798.08) చేరింది. ఈ సమయంలో సెన్సెక్స్ 30 షేర్ 5,063 పాయింట్లు లేదా 10.93 శాతం ఎగిసింది.

ర్యాలీ ఇలాగే
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో ఈ ర్యాలీ మరింత కాలం కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్ని రంగాల్లోను కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ఐటీ, ఆటో, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. ఎఫ్‌పీఐలు కూడా పెరిగాయి. కాగా, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 28 నవంబర్ 2014న రూ.100 లక్ష కోట్లు దాటింది. ఆరేళ్ళలో గతవారం రూ.200 లక్షల కోట్లు క్రాస్ చేసింది.


Click it and Unblock the Notifications