IMF On GDP: అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ భారత్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ఇతర దేశాల ఆర్థికాల కంటే మెరుగ్గా ముందుకు దూసుకుపోతోంది.
ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారతదేశ FY24 GDP వృద్ధి అంచనాను సవరించింది. గతంలో అందించిన 6.1 శాతం వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతంగా పేర్కొంది. IMF తన అక్టోబర్ 2023 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో ఈ వివరాలను మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అయితే FY25లో ఇది 4.6 శాతానికి చేరుకుంటుందని తన అంచనాల్లో వెల్లడించింది.

2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి బలంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఏప్రిల్-జూన్‌లో ఊహించిన దానికంటే బలమైన వినియోగాన్ని ప్రతిబింబిస్తున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా FY24 జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే తమ అంచనాలను ప్రకటించాయి.
IMF మంగళవారం చైనా, యూరో ప్రాంతంలో వృద్ధికి సంబంధించి తన అంచనాలను తగ్గిస్తూ ప్రకటన చేసింది. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన బలంతో ఉందని పేర్కొన్నప్పటికీ మెుత్తం ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది. IMF తన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో 2023 గ్లోబల్ రియల్ జీడీపీ వృద్ధిని 3.0% వద్ద మార్చకుండా స్థిరంగా కొనసాగించింది.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, గత సంవత్సరం ఇంధన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కొనసాగిందని IMF చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివర్ గౌరించాస్ అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి పోకడలు చాలా భిన్నంగా ఉన్నాయని, మధ్యకాలిక వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం, అస్థిర వస్తువుల ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణంలో పునరుజ్జీవనానికి సంబంధించిన నష్టాల గురించి గౌరించాస్ ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications