Investment: భారత కంపెనీలో రూ.300 కోట్ల పెట్టుబడి.. అంతర్జాతీయ సంస్థ నిర్ణయం..
Investment: ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో సభ్యుడైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) డెవలపింగ్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటుంది. తాజాగా ఇది భారతీయ అగ్రో కెమికల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఐఎఫ్సీ ఒక ప్రైవేట్ రంగంపై దృష్టి సారించిన అతిపెద్ద ప్రపంచ అభివృద్ధి సంస్థ.

నిధుల సమీకరణ..
దేశీయ ఆగ్రో-కెమికల్ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణ, వృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇందుకోసం IFC నుంచి రూ.300 కోట్లను సమీకరించినట్లు వెల్లడించింది. IFC తన ఎమర్జింగ్ ఏషియా ఫండ్ ద్వారా ఈ పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా క్రిస్టల్ క్రాప్‌కు.. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సరఫరా గొలుసు అంతరాయాల తగ్గింపు, బలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తనవంతు సహాయాన్ని అందిస్తోంది.

వ్యాపార తోడ్పాటు..
కంపెనీ ప్రాజెక్ట్ రైతులకు అనుకూలమైన, సరసమైన, పర్యావరణ అనుకూలమైన పంట రక్షణ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుంది. IFC ఎమర్జింగ్ ఏషియా ఫండ్ ను 2016లో ప్రారంభించింది. ఫైనాన్సింగ్ ప్యాకేజీ క్రిస్టల్ వృద్ధి ప్రణాళికలకు మద్దతు ఇస్తుంది. కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని తెలుస్తోంది. భారతీయ రైతులకు ఇది రానున్న కాలంలో లాభదాయకతను పెంచటానికి దోహదపడుతుందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంకుర్ అగర్వాల్ అన్నారు.

కరోనా తర్వాత..
భారత్ కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తరుణంలో.. వ్యవసాయ రంగం గ్రీన్ రికవరీకి చాలా కీలకం. అందువల్ల రైతుల అవసరాలకు అనుగుణంగా టైలర్ మేడ్ అగ్రి సొల్యూషన్స్‌ను మెరుగుపరచడంలో తమ పెట్టుబడి సహాయపడుతుందని ఐఎఫ్‌సిలో ఇండియా కంట్రీ హెడ్ వెండి వెర్నర్ అన్నారు. వాతావరణ స్మార్ట్ అగ్రిబిజినెస్‌ను బలోపేతం చేయడం దేశంలో తమ మిషన్‌కు గుండెకాయ అని వెర్నర్ చెప్పారు.

కొత్త కొనుగోళ్లు..
కంపెనీ ఇటీవలే ఆగ్రోకెమికల్ రిటైల్‌లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపార విస్తరణలో భాగంగా గత ఐదేళ్లలో 6 కొనుగోళ్లు చేసిన కంపెనీ.. ఇప్పటి వరకు మెుత్తం 9 కొనుగోళ్లను చేపట్టింది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 7 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీ తన ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది.


Click it and Unblock the Notifications