world cup: క్రికెట్ వరల్డ్‌కప్‌పై కన్నేసిన విదేశీ కంపెనీలు.. సెకనుకు ఎంత ఖర్చు చేస్తున్నాయంటే?
world cup: ఇండియాలో క్రికెట్ ను ఓ ఆటగా చూడరు. అదొక మతంలా భావిస్తారు. భారతీయుల మదిలో అంతటి స్థానం సంపాదించిన ఆట మరోటి లేదంటే అతిశయోక్తి లేదు. దీన్ని క్యాష్ చేసుకోవాలని దేశవిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకోసం మ్యాచ్ ల సమయంలో స్క్రీన్లపై తమ కంపెనీ యాడ్స్ ప్రసారం చేయడానికి ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
భారత్ లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ లో తమ బ్రాండ్ ను ప్రదర్శించేందుకు గ్లోబల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. క్రికెట్ ను విపరీతంగా అభిమానించే 1.4 బిలియన్ల జనాభాను ఒకేసారి కవర్ చేయడానికి ఈ ఈవెంట్ సరైన వేదిక అని భావిస్తున్నాయి. అందుకే ప్రకటనల కోసం సెకనుకు 3 వేల 600 డాలర్లు (దాదాపు 3 లక్షల రూపాయలు) వెచ్చిస్తున్నాయని అంచనా.

అక్టోబర్ 5న ప్రారంభమై ఈ టోర్నమెంట్.. నవంబర్ మధ్య వరకు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ఈ మ్యాచ్ లను వీక్షిస్తారని తెలుస్తోంది. ఇందులో సాధ్యమైనంత ఎక్కువ సమయం తమ యాడ్స్ చూపించేందుకు విదేశీ బ్రాండ్స్ తహతహలాడుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపారు.
స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు ఈవెంట్ ను ప్రసారం చేసే సమయంలో.. అడ్వర్టైజ్‌మెంట్ స్లాట్ ల కోసం దాదాపు 20 బిలియన్ రూపాయలు ఖర్చుపెట్టే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా పార్టనర్ జెహిల్ థక్కర్ అంచనా వేశారు. కేవలం 10 సెకన్ల యాడ్ కోసం మిలియన్ రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. 2019లో జరిగిన గత ప్రపంచకప్ తో పోలిస్తే ఇది 40 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
జెఫరీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ స్పాన్సర్‌షిప్ మరియు మీడియా స్పెండింగ్ ను ఆకర్షిస్తోంది. క్రీడలకు సంబంధించి చేస్తున్న మొత్తం వ్యయంలో ఇది 85 శాతం వాటా ఆక్రమిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications