LIC News: అదానీ సంస్థ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలోనూ అండగా నిలిచిన అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఎల్ఐసీ కూడా ఒకటిగా నిలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
ఇటీవలి మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో.. అదానీ గ్రూప్ షేర్లలో పెరుగుదల నమోదైన సంగతి తెలిసిందే. దీనికి తోడు కోర్టులో అనుకూలంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో మూడు అదానీ గ్రూప్ కంపెనీల్లో తన పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా ఎల్‌ఐసీ లాభాలను పొందింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌లో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకుంది. ఈ త్రైమాసికంలో మొత్తంగా ఎల్‌ఐసీ మూడు కంపెనీలకు చెందిన 3,72,78466 షేర్లను విక్రయించింది.

డిసెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల సమాచారం ప్రకారం ఈ మూడు కంపెనీలకు చెందిన మొత్తం 3.72 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ విక్రయించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ అంబుజా సిమెంట్స్‌కు చెందిన 4,500 షేర్లను కొనుగోలు చేసింది. అలాగే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఎల్‌ఐసీ తన వాటాను 3.68 శాతం నుంచి 3 శాతానికి తగ్గించుకోగా ఈ త్రైమాసిక కాలంలో షేరు ధర 42 శాతం పెరిగింది.
ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీ వాటా డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 3.93 శాతానికి చేరుకోగా, సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి వాటాలు 4.23 శాతంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో కంపెనీ షేరు ధర ఏకంగా 29 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే అదానీ పోర్ట్స్‌లో ఎల్‌ఐసీ తన వాటాను కూడా తగ్గించుకుంది. డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి కంపెనీలో ఎల్‌ఐసీ వాటా 7.86 శాతానికి చేరుకుంది. రెండవ త్రైమాసికంలో 9.07 శాతంగా ఉండగా.. డిసెంబర్ త్రైమాసికంలో షేరు 46 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications