Insurance News: బీమా రంగంలో డబుల్ ఇస్మార్ట్ సర్వీసెస్.. ఇన్సూరెన్స్ ప్రమాదాలకే కాదు, అంతకు మించి..
property rent: పెట్టుబడి సాధనాల్లో పేరెన్నిక గన్నవి బంగారం, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. ఇందుకు భిన్నంగా ఇటీవల భారీ రిటర్న్స్ ఇచ్చిన మరో రంగం రియల్ ఎస్టేట్. కొనుగోలు చేసిన భూమిని లేదా ఇంటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెలా ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రిస్క్ కూడా నామమాత్రమే కావడంతో ఎక్కువమంది ఈ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఒక్కోసారి జరిగే అనుకోని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు బీమా సంస్థలు ఎలాగో ఉన్నాయి. కేవలం ప్రాపర్టీ లాస్ సమయంలో మాత్రమే ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనుకోవడం సరికాదు.
గతంతో పోలిస్తే బీమా సంస్థలు ఇటీవల పలు రంగాలలో మెరుగైన సేవలను అందిస్తున్నాయి. యూజర్లకు అనుకూలమైన విధంగా ప్లాన్స్ డిజైన్ చేస్తున్నాయి. సాధారణ బీమాలతో పాటు యాడ్-ఆన్స్ కింద మరింత ఎక్కువ కవరేజీని కూడా కల్పించేందుకు వెనకాడటం లేదు. ప్రాపర్టీలు ఇందుకు అతీతమేమీ కాదు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి బీమా సంస్థలు కవరేజ్ ఇస్తాయి. కానీ అంతకుమించి మరిన్ని సేవలందిస్తాయని చాలామందికి తెలియదు.

స్థిరమైన ఆదాయ వనరుగా ఉన్న అద్దె ప్రాపర్టీ పై ఏదైనా పరిస్థితుల వల్ల రెంట్ లభించకపోతే కూడా బీమా సంస్థలు అండగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని కంపెనీలు ప్రత్యేక పాలసీలను రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని ఉన్న పాలసీలకే యాడ్-ఆన్ కింద ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏవైనా మరమ్మత్తులు లేదా ప్రకృతి విపత్తుల వల్ల అద్దె లభించని పరిస్థితి ఏర్పడితే బీమా సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అంటున్నారు. నిబంధనలకు అనుగుణంగా కొంత కాలం వరకు ఆర్థిక భరోసా ఇస్తాయని పేర్కొంటున్నారు. ఈ తరహా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంతో మంచిదని సూచిస్తున్నారు.
'లాస్ ఆఫ్ రెంట్ కవర్ భూస్వాములకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వలన ఏర్పడే నష్టాలకు ఎలాగో బీమా కంపెనీలు తోడ్పాటు ఇస్తాయి. అయితే ఆ తర్వాత కొంతకాలం వరకు ఆ ప్రాపర్టీ నుంచి ఎటువంటి ఆదాయం రాదు. ఎందుకంటే అది నివాసయోగ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కవర్ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని ప్రతినెలా అందుకోవచ్చు. ఇది అద్దె నష్టంతో పాటు ఆర్థిక నష్టాన్ని కూడా తగ్గించేందుకు తెలివైన ఎంపిక' అని బజాజ్ అలియాన్జ్ రిస్క్ ఇంజనీర్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా తెలిపారు.


Click it and Unblock the Notifications