IPO News: ఐపీవో కిరాక్ లిస్టింగ్.. పెట్టుబడిపై తొలిరోజే 100 శాతం రాబడి, ఖుషీ ఖుషీగా ఇన్వెస్టర్స్
Innomet Advanced Materials IPO: నిన్న ఐపీవో మార్కెట్ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. బీఎస్ఈ చివరి నిమిషంలో అప్రమత్తతో ఒక ఐపీవో లిస్టింగును వాయిదా వేయగా, మరో ఐపీవో మార్కెట్లోకి ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేసి బెట్టింగ్ వేసిన వారిని నిరాశకు గురిచేసింది. అయితే నేడు తిరిగి తన బుల్ జోరును ఐపీవోలు ప్రదర్శిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఇష్యూ ధర కంటే 90 శాతం ప్రీమియం రేటు వద్ద ఎన్ఎస్ఈలో అద్భుతమైన జాబితాను నమోదు చేశాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు మార్కెట్లోకి ఒక్కోటి రూ.190 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ తన ఇష్యూ గరిష్ఠ ధరను రూ.100గా ఉంచింది. లిస్టింగ్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు రావటంతో ధర 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యింది. దీంతో స్టాక్ ధర రూ.199.50గా ఉంది. దీంతో పెట్టుబడిదారులు తొలిరోజే 99.50 శాతం రాబడిని అందుకున్నారు.

ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఇష్యూ మూడు రోజుల సమయంలో 323 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వం పొందింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ మార్కెట్ల నుంచి రూ.32.24 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో 3,252,000 తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచగా.. 1,05,34,03,200 షేర్లకు బిడ్లు రావటం ఐపీవో క్రేజును ప్రతిబింబిస్తోంది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, మూలధన వ్యయం కోసం కంపెనీ ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.
ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ కంపెనీ 1984లో స్థాపించబడింది. కంపెనీ మెటల్ పౌడర్‌లు, టంగ్‌స్టన్ హెవీ అల్లాయ్‌లను తయారు చేస్తుంది. కంపెనీ తన ఉత్పత్తులను ఇండియాతో పాటు అమెరికా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్, ఇటలీ, న్యూజిలాండ్, లెబనాన్, బ్రూనై వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.55.17 లక్షల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది భారీగా పెరిగి రూ.3.22 కోట్లకు చేరుకుంది. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.2.52 కోట్లుగా ఉన్నప్పటికీ.. కంపెనీ ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 14 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ.29.56 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications