కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!
గత క్వార్టర్‌లో అమెరికా వృద్ధి రేటు రికార్డ్‌స్థాయిలో 32.9 శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా సహా అగ్రరాజ్యాలు దీని వల్ల అతలాకుతలమయ్యాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. కరోనా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి పెరిగింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది
ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. కరోనా వ్యాప్తి పెరగడంతో అగ్రరాజ్యంలో పలు రాష్ట్రాల్లో రెండోసారి లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది. ఈ క్యాలెండర్ ఇయర్ రెండో ఏడాదిలో ఆర్థిక వృద్ధి భారీగా పడిపోతుందని ప్రభుత్వం అంచా వేసింది. అంతకుముందు క్వార్టర్‌లో 10 శాతం క్షీణత నమోదయింది. ఇది 1958 నుండి కనిష్టం. అయితే ఈసారి 32.9 శాతం క్షీణత నమోదయింది.

సెప్టెంబర్‌లో పుంజుకోవచ్చు..
ఈ రెండు క్వార్టర్‌లలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ సెప్టెంబర్ క్వార్టర్‌లో పుంజుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగిత రోజురోజు రోజుకు పెరుగుతోంది. గత వారం 14 లక్షలమంది ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగ భృతి కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వరుసగా 19వ వారం 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ భృతి కింద దరఖాస్తు చేసుకున్నారు. మార్చికి ముందు ఇది 7 లక్షలకు మించలేదు.

ప్రతి వారం పది లక్షల మంది
చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు, ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచేందుకు చాలా రాష్ట్రాలు వెనకాడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతలు ఎప్పటికి అప్పుడు పెరుగుతున్నాయి. అమెరికాలో అతిపెద్ద మాంద్యం సమయంలోనూ నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న అమెరికన్ల సంఖ్య 7 లక్షలకు మించలేదు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రతీ వారం పది లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. దాదాపు 30 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కింద సాయం పొందుతున్నారు.

70 శాతం వాటా ఉన్న ఆ రంగం క్లోజ్
రెండో క్వార్టర్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఓ సమయంలో 300 పాయింట్లకు పైగా పడిపోయింది. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మార్కెట్లపై మరింత ప్రభావం పడింది. కన్స్యూమర్ స్పెండింగ్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా పడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇది దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కన్స్యూమర్ స్పెండింగ్స్ 34.6 శాతం తగ్గింది. ట్రావెల్, రెస్టారెంట్లు, బార్లు, ఎంటర్టైన్మెంట్, రిటైల్ వ్యాపారాలు పూర్తిగా మూతబడ్డాయి. కరోనా కారణంగా అమెరికా జీడీపీ పడిపోయిందని క్యాపిటల్ ఎకనమిక్స్ అనలిస్ట్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications