దేశం IT రంగంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ విపణిలో విజయ బావుటా ఎగరేస్తోంది. ప్రపంచ టాప్ 10 IT సంస్థల్లో రెండు మనవే కావడం గర్వకారణం. టాటా గ్రూపునకు చెందిన TCS రెండవ స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్ 10వ స్థానంతో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి, దేశీయంగా ఈ రెండింటిలో సత్తా చాటనున్న కంపెనీ గురించి రేటింగ్ సంస్థ మూడీస్ అంచనాలు విడుదల చేసింది.

ఆదాయమే కారణం:
భారతీయ దిగ్గజ IT సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ లపై అతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థి సంవత్సరం ముగిసే నాటికి టాటా కంపెనీని వెనక్కు నెట్టి ఇన్ఫీ వృద్ధిలో దూసుకుపోనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఆదాయం TCS కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇన్ఫీ నుంచి 13 శాతం, TCS నుంచి 8 శాతం మేర వృద్ధిని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.

వచ్చే ఏడాది మాత్రం..
మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో TCS, ఇన్ఫోసిస్ ఆదాయాల్లో మంచి వృద్ధి ఉంటుందని మూడీస్ అభిప్రాయపడింది. అందుకుగాను రెండింటికీ Baa1 రేటింగ్ ను ఇచ్చింది. కానీ వచ్చే ఏడాదిలో మాత్రం వృద్ధి కొంత మేర మందగిస్తుందని అంచనా వేసింది.
ఇన్ఫీ వృద్ధి 8 శాతం, TCS వృద్ధి 5 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. ఆదాయ వృద్ధిలో కొంత మితంగా ఉన్నా, రెండు కంపెనీల పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరచింది.

వాటిపై దృష్టిసారించాలి:
ఉద్యోగుల నియామకాలు, అట్రిషన్ లపై ఇన్ఫోసిస్ దృష్టి పెట్టాలని మూడీస్ సూచించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించాలని చెప్పింది. 2024, 2025లో దాని EBITDA మార్జిన్ 24 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని నివేదించింది. ఇక TCS విషయానికి వస్తే, ఉద్యోగి వినియోగాన్ని మెరుగుపరచుకోవాల్సి అవసరం ఉందని అభిప్రాయపడింది. EBITDA మార్జిన్ 25 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేసింది.


Click it and Unblock the Notifications