ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపేందుకు నడుం బిగించింది. ఉద్యోగులు ఓవర్ టైం చేయవద్దని ఉద్యోగులకు మెయిల్ చేస్తోంది. ఉద్యోగులు సాధారణ పని గంటలు మాత్రమే పని చేయాలని ఎక్కువ సమయం పని చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పని సమయాన్ని HR టీమ్ ట్రాక్ చేస్తోంది. ఓవర్ టైం చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా పర్సనల్ మెయిల్స్ పంపుతోంది.
కంపెనీ రూల్ ప్రకారం.. ప్రతి ఉద్యోగి ప్రతి నెలా సగటున రోజుకు 9.15 గంటలు, వారంలో 5 రోజులు పని చేయాలి. అయితే దాని కంటే ఎక్కువగా చాలామంది పనిచేస్తున్నారు. అలా చేసే వారికి మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కంపెనీ మెయిల్ పెడుతోంది. HR పంపే మెయిల్ లో రోజుకు సగటున ఎంత సమయం పనిచేసారు, ఎన్ని రోజులు రిమోట్ గా పనిచేశారు. ఎంత సమయం పనిచేశారు అనే వివరాలు ఉంటాయి.

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి: కంపెనీ ఉద్యోగికి పంపే మెయిల్ లో మీరు ఓవర్ టైం చేస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పాటించడం వ్యక్తిగత ఆరోగ్యం కోసమే కాదు, దీర్ఘకాలిక ప్రొఫెషనల్ విజయానికి కూడా ఎంతో అవసరమని టెక్ దిగ్గజం స్పష్టం చేస్తోంది. అలాగే, అవసరమైతే బ్రేక్‌లు తీసుకోవడం, ఒత్తిడిగా అనిపిస్తే వివరించడం, అవసరమైనప్పుడు పనిని డెలిగేట్ చేయడం, పని తర్వాత పూర్తిగా డిస్‌కనెక్ట్ కావడం వంటి సూచనలు కూడా కంపెనీ టీం పంపిన మెయిల్ లో ఉన్నాయి.
గత నిబంధనలు మాటేంటి ? కాగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20న హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు మారింది. నెలకు కనీసం 10 రోజులు ఆఫీసుకు రావాల్సిన విధానాన్ని ప్రవేశపెట్టింది.దీని తర్వాత రిమోట్ వర్క్ పని ఎలా ఉంది..ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే విషయం మీద రీసెర్చ్ మొదలుపెట్టింది HR టీం.అయితే వారి రీసెర్చ్ లో ఉద్యోగులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పరిశీలించింది. హార్ట్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, తినే సమయాలు లేకపోవడం వంటివి ఉద్యోగులను వెంటాడుతున్నాయని గమనించింది.
70 గంటలు పనిపై కంపెనీ యూటర్న్ ? కంపెనీలో 3.2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ తాజాగా ఈ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. ఉద్యోగుల ఆరోగ్యపరమైన రిస్కులను తక్కువ చేయాలని చూస్తోంది. అయితే కొత్తగా వచ్చిన ఈ విషయం గతంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పిన అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నారాయణ మూర్తి ఆ మధ్య కాలంలో ఉద్యోగులు 70 గంటలు పని చేయాలని సూచించిన విషయం విదితమే.
దేశం అభివృద్ధి చెందాలంటే యువత కష్టపడాలని పిలుపునిచ్చారు. నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీశాయి. కొంతమంది ఆయన వ్యాఖ్యలను స్వాగతించినా..మరికొంతమంది ఆయన వ్యాఖ్యలను ఖండించారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు భారత ఐటీ రంగంలో ఆరోగ్యానికి హానికరం అని విమర్శించారు.


Click it and Unblock the Notifications