శాలరీ పెంపు, ప్రమోషన్లు: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్, 16,500 ఫ్రెషర్స్‌కు ఛాన్స్
తన ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. ఉద్యోగాలు పెంచుతామని, ప్రమోషన్లు ఉంటాయని, అన్ని స్థాయిల్లోను ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. జనవరి 1వ తేదీ నుండి వేతన పెంపు, ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఇన్ఫోసిస్ బుధవారం (అక్టోబర్ 14) మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా వేతన పెంపు, ప్రమోషన్లపై ప్రకటన చేసింది.

ఇన్ఫోసిస్ విజయంలో ఉద్యోగులదే కీలక పాత్ర
అంతేకాదు, రెండో త్రైమాసికం కోసం ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు 100 శాతం వేరియేబుల్ పే ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 2.40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ బలం రెండో క్వార్టర్‌లో కనిపించిందని ఇన్ఫోసిస్ సీఈవో ప్రవీణ్ రావు అన్నారు. తమ కంపెనీ విజయంలో ఉద్యోగులదే కీలక పాత్ర అన్నారు. వారి అద్భుతమైన పనితీరును గుర్తించి వంద శాతం వేరియేబుల్ పే ఇస్తున్నామన్నారు. అలాగే జనవరి ఒకటో తేది నుండి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు వేతన పెంపు, ప్రమోషన్లు అమలు చేస్తామని ప్రకటించారు.

తగ్గిన ఆట్రిషన్ రేటు
ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 18.3 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 7.8 శాతానికి తగ్గినట్లు తెలిపింది. గత ఎన్నో క్వార్టర్‌లతో చూస్తే ఇది కనిష్టం. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా ఆట్రిషన్ రేటు ఆల్ టైమ్ కనిష్టం 8.9 శాతానికి చేరుకుందని ఇటీవల కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో తెలిపింది. టీసీఎస్ కూడా అక్టోబర్ 1వ తేదీ నుండి ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది.

5,500 నియామకాలు
కంపెనీ స్పెషల్ బోనస్‌ను డిసెంబర్ త్రైమాసికంలో అందించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. సెప్టెంబర్‌లో వంద శాతం వేరియేబుల్ పే చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ 2019లో 85 శాతం మంది ఉద్యోగులకు 6 శాతం వేతనం పెంచింది. ఉద్యోగుల సంఖ్య 2,40,208. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 3000 మంది ఫ్రెషర్స్ సహా 5500 మందిని కొత్తగా నియమించింది. ఈ ఏడాది 16,500 మంది ఫ్రెషర్స్‌ను నియమించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని, వచ్చే ఏడాది 15,000 మందిని తీసుకుంటామని ప్రవీణ రావు తెలిపారు. కాగా, క్లయింట్స్ టెక్నాలజీ సేవలపై ఖర్చులు పెంచుతున్నారని ఇన్ఫోసిస్ తెలిపింది.


Click it and Unblock the Notifications