ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతన పెంపు, జూలై నుండి అమలు: 20వేల కొత్త ఉద్యోగాలు
జూలై 2021 నుండి వేతనాలు పెంచనున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. అలాగే, గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. జులై 2021 నుండి అమలులోకి వచ్చేలా ఇన్ఫోసిస్ వేతన పెంపును అమలు చేస్తామని తెలిపింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇది రెండో పెంపు. వలసల రేటును తగ్గించడం కోసం (ఆట్రిషన్ రేటు), నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకోవడం కోసం కంపెనీ ఈ చర్యలను చేపట్టింది. జనవరి 2021లో వేతనాల పెంపు అమలు చేసింది. ఇప్పుడు జూలై 2021 రెండోసారి.

కొత్త ఉద్యోగాలు
దేశంలో 19,230 మంది కొత్తవారిని నియమించుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. క్లయింట్స్ నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా భారత్ వెలుపల 1,941 మందిని తీసుకుంటామన్నారు. 2022 వరకు అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటామని, అదనంగా 12,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికాలో నియామకాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు.
కెనడాలో కూడా వచ్చే రెండేళ్లలో ఉద్యోగులను రెండింతలు పెంచుకుంటామన్నారు. ప్రస్తుతం 2000గా ఉంది. దీనిని 4,000కు పెంచుకోనున్నారు. బ్రిటన్‌లో 1,000 డిజిటల్ ఉద్యోగాలు సృష్టించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

హెచ్1బీ అనుమతులు
FY21 మొదటి త్రైమాసికం నుండి అమెరికాలో H1B వీసాల దరఖాస్తులకు అనుమతులు ఇచ్చే రేటు పెరిగిందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ వీసాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో తమకు ఉన్నారని, క్లయింట్ల కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. అమెరికాలో 65 శాతం స్థానిక ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది.

ఇప్పటికే విప్రో అమలు...
ఇప్పటికే విప్రో సంస్థ తమ కంపెనీలోని 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ మేనేజర్ అంతకు తక్కువస్థాయి బ్యాండ్ B3 ఉద్యోగుల్లో అర్హులకు మెరిట్ శాలరీ ఇంక్రీజెస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరిలోనే ఈ బ్యాండ్‌లోని పలువురు ఉద్యోగులకు వేతనాలు పెంచామని, దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ నెలలో పెంచుతామన్నారు.


Click it and Unblock the Notifications