Infosys News: గత కొంతకాలంగా నిరుద్యోగులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రెషర్ల నియామకాలను కంపెనీలు లేట్ చేస్తున్న కొద్దీ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఒకటి, అరా సంస్థలు రిక్రూట్ చేసుకుంటున్నా వారు ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలు వింటే అసలు ఎందుకు చదువుకున్నామా అనిపిస్తోంది. ఇదే విషయంలో ఇటీవల కాగ్నిజెంట్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భారతీయ కంపెనీలు కూడా గత 10 ఏళ్ల నుంచి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల ప్యాకేజీల్లో పెద్దగా మార్పులు చేయలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమయంలో రెండో అతిపెద్ద దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ప్రెషర్ల నియామకానికి సంబంధించి కొత్త ప్రోగ్రాం రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా హైర్ చేసుకునే సిబ్బందికి ప్రారంభంలోనే 9 లక్షల వరకు ప్యాకేజ్ ఆఫర్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. సాధారణ ఫ్రెషర్స్ హైరింగ్ కు ఇది పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది.

సాధారణంగా ఇన్ఫోసిస్ ప్రెషర్లకు 3 నుంచి 3.5 లక్షల మేర వార్షిక వేతన ప్యాకేజ్ ఇస్తుంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిభ కలిగిన ప్రెషర్లను ఆకర్షించడం కోసం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్ లో సవాళ్లను గుర్తించగలిగే నైపుణ్యం కలిగిన కొత్త వారికి ఇందులో అవకాశం కల్పించనుంది. ఈ మేరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పింది. వీరి వేతనాలు 4.5 లక్షల నుంచి ప్రారంభమై 9 లక్షల మధ్యలో ఉంటాయని అనౌన్స్ చేసింది.
ఇదేరంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా గతేడాది ఇదే తరహా ప్లాన్ రోల్ అవుట్ చేసింది. ప్రైమ్ గా పిలవబడే ఈ ప్రాజెక్టులో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎంపికైన వారికి 9-11 లక్షల ప్యాకేజీ అందించాలని నిర్ణయించింది. ప్రస్తుత బూమింగ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ AI వంటి సాంకేతికతల్లో ప్రావీణ్యులకు ఈ మేరకు జీతభత్యాలు ఆఫర్ చేయాలని భావించింది. ఇదే కాకుండా నింజా, డిజిటల్ పేరిట కూడా 3.6 మరియు 7.5 లక్షల ప్యాకేజీతో TCS ఫ్రెషర్స్ నియామకాలు చేపడుతోంది.


Click it and Unblock the Notifications