Anthropic: స్టాక్ మార్కెట్‌లో ఐటీ షేర్ల సందడి.. నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట! కారణం ఇదే!
భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఐటీ షేర్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఐటీ సర్వీసెస్ రంగం దెబ్బతింటుందనే భయాల మధ్య.. మంగళవారం ట్రేడింగ్‌లో భారీ రికవరీ కనిపించింది. అయితే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఆంథ్రోపిక్ (Anthropic) తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. దీని ప్రభావంతో ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 4 శాతం పెరగగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 3 శాతం లాభపడింది.

ఇన్ఫోసిస్ - ఆంథ్రోపిక్ ఒప్పందం విశేషాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఒక ముప్పుగా చూడకుండా ఒక శక్తివంతమైన సాధనంగా మార్చుకునే దిశగా ఇన్ఫోసిస్ అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన అత్యాధునిక 'క్లాడ్ (Claude)' ఏఐ మోడల్స్ ను ఇన్ఫోసిస్ తన 'టోపాజ్ (Topaz)' ఏఐ ఆఫరింగ్స్‌తో అనుసంధానం చేయనుంది. టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో సంస్థలకు మెరుగైన ఏఐ సొల్యూషన్స్ అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం.
దీని కోసం ప్రత్యేకంగా ఒక 'ఆంథ్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. "ఏఐ అనేది కేవలం వ్యాపారాలను మార్చడమే కాదు, పరిశ్రమలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచిస్తోంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇతర ఐటీ షేర్ల పరిస్థితి
ఇన్ఫోసిస్ ఇచ్చిన బూస్ట్‌తో ఇతర ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు కూడా లాభాల బాట పట్టాయి:
- హెచ్‌సిఎల్ టెక్ (HCL Tech), విప్రో (Wipro), పర్సిస్టెంట్ సిస్టమ్స్: సుమారు 3 శాతం లాభపడ్డాయి.
- TCS, టెక్ మహీంద్రా, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ: సుమారు 2 శాతం వరకు పెరిగాయి.
- ఎంఫసిస్ (Mphasis): 2 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.
నిపుణులు ఏమంటున్నారు?
గత వారం ఐటీ ఇండెక్స్ సుమారు 8 శాతం నష్టపోయి 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'నోమురా' (Nomura) ప్రకారం.. ప్రస్తుత ధరల వద్ద ఐటీ షేర్లు 'వాల్యూ జోన్'లో ఉన్నాయి. అంటే ఐటీ రంగంపై ఉన్న ఆందోళనలు కాస్త అతిశయోక్తిగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ కంపెనీలు ఏఐను తమ ప్రయోజనం కోసం వాడుకుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. జేపీ మోర్గాన్ నివేదిక కూడా ఐటీ సంస్థలను టెక్ ప్రపంచానికి 'ప్లంబర్లు' గా అభివర్ణించింది. అంటే ఏఐ ఎంతగా ఎదిగినా ఆ వ్యవస్థలను సరిగ్గా నిర్వహించడానికి ఐటీ సర్వీసెస్ కంపెనీల అవసరం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తంగా ఏఐని చూసి ఐటీ రంగం అంతగా భయపడాల్సిన పని లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ రంగానికి ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలు మార్కెట్ లో సహజమే. అయితే ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఆంథ్రోపిక్ వంటి ఏఐ అగ్రగామి సంస్థలతో చేతులు కలపడం ద్వారా కొత్త టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలో చూపిస్తున్నాయి. ఇది కేవలం షేర్ ధరలను పెంచడమే కాకుండా ఇన్వెస్టర్లలో ఐటీ రంగంపై మళ్ళీ నమ్మకాన్ని కలిగించినట్టయింది.


Click it and Unblock the Notifications