Infosys: ఇండియన్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ Q4 ఫలితాలు విడుదల.. అట్రిషన్ రేట్ ఎలా ఉందంటే..
Infosys: భారతీయ టెక్ దిగ్గజం TCS ఫలితాలు మొన్న వెలువడగా, నిన్న ఇన్ఫోసిస్ వంతు వచ్చింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి గాను ఇన్ఫీ ఆదాయం దాదాపు 37.50 వేల కోట్లకు చేరింది. 6 వేల 134 కోట్ల బలమైన లాభాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 16 శాతం రాబడి పెరిగింది. కానీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
YoY ఫలితాలు బాగానే ఉన్నా, త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే మాత్రం లాభం మరియు రాబడిల్లో 6.86 శాతం, 2.49 శాతం చొప్పున క్షీణత నమోదైంది. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ఇన్ఫీ తన ఫలితాలను ప్రకటించింది. FY23 పూర్తి ఏడాదికి ఏకీకృత ఆదాయం 20.7 శాతం పెరగ్గా, నికర లాభాం మాత్రం 9 శాతం తగ్గి 24 వేల 95 కోట్లకు పరిమితమైంది. స్థిర కరెన్సీ ప్రకారం చూస్తే త్రైమాసిక ఆదాయ వృద్ది 3.2 శాతం క్షీణించినా.. వార్షికంగా 8.8, పూర్తి సంవత్సరానికి 15.4 శాతం చొప్పున వృద్ధి చెందింది.

FY23కి గాను 18.2 బిలియన్ డాలర్లను ఇన్ఫోసిస్ ఆర్జించింది. స్థిర కరెన్సీలో 15.4 శాతం, ఆపరేటింగ్ మార్జిన్ 20 శాతంతో పరిశ్రమలో అగ్రగామిగా నిలిచినట్లు ఫైలింగ్ లో పేర్కొంది. IT రంగంలోను, భౌగోళికంగాను విస్తృత వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. మొత్తం రాబడిలో డిజిటల్ విభాగం వాటా 62.2 శాతం ఉన్నట్లు చెప్పింది. ఇటీవల ట్రెండ్ ను కొనసాగిస్తూ.. గతేడాది నమోదైన 27.7 శాతం, ఇంతకు ముందు త్రైమాసికంలోని 24.3 శాతం అట్రిషన్ రేటు ఇప్పుడు 20.9 శాతానికి క్షీణించినట్లు తెలిపింది.
"బలమైన పనితీరుతో పాటు డిజిటల్, క్లౌడ్ మరియు ఆటోమేషన్ సామర్థ్యాలపై FY23లో నిరంతరం దృష్టి సారిస్తున్నాం. ఈ విభాగాల్లోని ఖాతాదారులు సైతం చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 100 మిలియన్ డాలర్ల క్లయింట్ల సంఖ్య 38 నుంచి 40కి పెరిగింది. 1 మిలియన్ డాలర్ మరియు 10 మిలియన్ డాలర్ క్లయింట్లు సైతం 922 మరియు 298 చొప్పున పెరిగారు. పర్యావరణ మార్పుల కారణంగా, క్లయింట్ల నుంచి సమర్థత, ఖర్చుతో పాటు ఏకీకరణ అవకాశాల కోసం బలమైన ఆసక్తిని చూస్తున్నాము" అని ఇన్ఫీ MD మరియు CEO సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications