Narayana Murthy: దేశంలోని టాప్ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీని నారాయణ మూర్తి స్థాపించిన వారిలో ఒకరు. మిత్రులతో కలిసి దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న పూణేలో జరిగిన ఆసియా ఎకనామిక్ డైలాగ్‌లో ఆయన పాల్గొన్నారు.

యువ టెక్కీలు..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి యువ నిపుణుల కోసం కొన్ని సలహాలు ఇచ్చారు. రిమోట్ వర్క్ విధానం, మూన్‌లైటింగ్‌కు యువ టెక్కీలు దూరంగా ఉండాలని అన్నారు. ఈ ట్రాప్ లో అస్సలు చిక్కుకోవద్దని తెలిపారు. నిజాయితీగా పని చేసే సంస్కృతిని నిర్మించాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు మక్కువ చూపాలని, ఈ విధానానికి తిరిగి అలవాటు పడాలని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

నిజాయతీ గురించి..
దేశంలో కష్టపడి పనిచేసే, నిజాయితీపరుల్లో ఒక "చిన్న విభాగం" మాత్రమే ఉందని ఆయన అన్నారు. యువ టెక్కీలు తాము ఇంటి నుంచి పనిచేస్తామని, తాము మూన్ లైటింగ్ కు పాల్పడతామని, వారానికి మూడు రోజులు మాత్రమే ఆఫీసులకు వస్తామనే ఆలోచనల ఉచ్చులో చిక్కుకోవద్దని సలహా ఇచ్చారు.

కరోనా కాలంలో..
ఎక్కడి నుంచి పనిచేయాలి అనే విషయాలు కరోనా యుగంలో విభజన అంశంగా మారింది. అయితే మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిచెప్పాయి. అయితే కొంత మంది సిబ్బందికి మాత్రం వారు కోరుకున్న విధంగా పని చేసేందుకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కంపెనీలు చాలా చోట్ల హైబ్రిడ్ వర్క్ విధానాన్నిఅమలులోకి తెచ్చి వారానికి కనీసం రెండు రోజులైనా కార్యాలయాలకు హాజరు కావాల్సిందేనని ఇటీవల తప్పనిసరి చేశాయి.

రెండు ఉద్యోగాలు..
సాధారణంగా భారతదేశంలో ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయటం అనే పోకడిని వ్యాపార వర్గాలు ప్రోత్సహించవు. ఒక దగ్గర ఫుల్ టైమ్ ఉద్యోగిగా పనిచేస్తూ.. రహస్యంగా రెండవ ఉద్యోగాన్ని నిర్వహించటాన్ని మూన్‌లైటింగ్ అంటూ ఇటీవల దేశీయ ఐటీ కంపెనీలు సీరియస్ యాక్షన్ తీసుకోవటం తెలిసిందే. దీనిపై ముందుగా దేశీయ టెక్ దిగ్గజం విప్రో కు చెందిన రిషద్ ప్రేమ్‌జీ ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. దీనిపై 2022లో ఆయన ఒక ట్వీట్ చేస్తూ మూన్‌లైట్‌ని "మోసం" అంటూ అభివర్ణించారు. ఆ కారణంగా కంపెనీ 300 మందిని కూడా తొలగించటం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications