Infosys: యువత.. రైతులు, కూలీలను చూసి నేర్చుకోవాలి: నారాయణమూర్తి
Narayana Murthy: దేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ మూర్తి తాను గతంలో చేసిన కామెంట్స్‌ను సమర్థించుకున్నారు. కొన్ని నెలల కిందట ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన ఈ ప్రకటనపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
దేశంలో రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని మూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యావంతులైన ప్రజలు కష్టపడి పనిచేయాలన్నారు. దేశంలోని ప్రభుత్వాలు అందించిన రాయితీలతో విద్యను పొందినవారు ఇప్పుడు దేశంలోని పేదల కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని నారాయణమూర్తి అన్నారు.

70 గంటలు పనిచేయాలని మూర్తి ఇచ్చిన పిలుపుపై దేశీయంగా సోషల్ మీడియాలో అనేక రియాక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇతర దేశాల్లో ఉన్న తన స్నేహితులు, ఎన్నారైలు చాలా మంది సంతోషిస్తున్నారని నారాయణ మూర్తి అన్నారు. తానెప్పుడూ తాను చేయని సలహాలు మరెవరికీ ఇవ్వలేదన్నారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌లో ఉదయం 6 గంటలకు పని ప్రారంభించి రాత్రి 9 గంటలకు పని ముగించేవారని సుధా మూర్తి తెలిపారు. రోజుకు 12 గంటలు పనిచేసేవారని అన్నారు.
ప్రస్తుతం దేశంలోని యువతకు వారంలో 70 గంటలు పని చేయాలని సలహా ఇస్తున్న మూర్తి గతంలో 90 గంటలు పనిచేసేవారని సుధామూర్తి వెల్లడించారు. ఇది నారాయణమూర్తికి మామూలేనని అన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 2023లో పోడ్‌కాస్ట్‌లో భారతదేశ పని ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని చెప్పారు. చైనా లాంటి దేశం కంటే ముందుకెళ్లాలంటే ప్రతివారం 70 గంటలు పని చేసే అలవాటు చేసుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన జపాన్, జర్మనీలు ఇదే పనిచేశాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.


Click it and Unblock the Notifications