Infosys: చచ్చేదాకా మారనంటున్న నారాయణమూర్తి.. ఎందుకీ పట్టుదల..!! టెక్కీలకు కష్టమే..
Infosys Murhty: దేశంలో ఐటీ పరిశ్రమ అనగానే సాధారణంగా గుర్తొచ్చే పేర్లలో కొన్ని టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా. అయితే వీటిలోనూ ముఖ్యంగా ఇన్ఫోసిస్ కంపెనీ నిరంతరం వార్తల్లో ఉంటూనే ఉంది. దీనికి కారణం సుధామూర్తి, నారాయణ మూర్తి. వీరు తరచుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటంతో పాటు అనేక అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకుంటుంటారు. చాలా సార్లు ఈ విషయాలపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే పని విషయంలో వారానికి 70 గంటలు భారతీయ యువత వర్క్ చేయాలని అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఇన్ఫోసిస్‌కి చెందిన నారాయణ మూర్తి చాలా నెలల కిందట కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి పరిశ్రమ నుంచి కొంత సపోర్ట్ వచ్చినప్పటికీ సాధారణ ప్రజలు, ఉద్యోగుల, వైద్యుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను చూసింది. తాజాగా ఇదే విషయంపై CNBC గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కూడా నారాయణ మూర్తి స్పందించారు. 70 గంటల పని విషయంలో తన అభిప్రాయ మారదని ఇందుకోసం తనను క్షమించాలని పేర్కొన్నారు. తాను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుందన్నారు.

దీనిపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మాట్లాడుతూ. 1986లో భారతదేశం వారానికి 6 రోజుల పని నుంచి 5 రోజులకు మారినప్పుడు తాను చాలా బాధపడ్డానని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ.. దేశ ప్రధాని వారానికి 100 గంటలు పనిచేస్తున్నప్పుడు మనమెందుకు దేశంకోసం శ్రమించలేమని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలు తిరిగి అభివృద్ధి బాటలో ముందుకు సాగి ధనిక దేశాలుగా మారాయని.. మనం సైతం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే పనిచేయటం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలుగా మారిన వాటి మార్గంలోనే ఇండియా కూడా నడవాల్సిన పరిస్థితి గురించి మూర్తి నొక్కి చెప్పారు. దీని వల్ల దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి చేసిన మెుదటి ఉద్యోగం ఐఐటీ అహ్మదాబాదులో రీసెర్చ్ అసోసియేట్. అక్కడ ఆయన చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఉద్యోగం కోసం విప్రోలో ప్రయత్నించగా.. అజీమ్ ప్రేమ్‌జీ తనను ఉద్యోగానికి నియమించుకోకుండా తిరస్కరించారని వెల్లడించారు. ఈ నియామక తప్పిదం జరగకుండా ఉండి ఉంటే ఇన్ఫోసిస్ కథ వేరే విధంగా ఉండేదని నారాయణమూర్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications