ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్‌కు ముగింపు పలికిన కంపెనీ
గత ఏడాది కాలంగా ఐటీ ఉద్యోగులకు కష్టకాలం నడుస్తోంది. ఒకవైపు ఏఐ రాక, మరోవైపు ఉద్యోగాల కోత, జీతాల పెంపులో జాప్యం వంటి వరుస సమస్యలతో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేందుకు (వర్క్ ఫ్రమ్ హోమ్) అనుమతి ఇచ్చాయి. మహమ్మారి ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరాయి. కానీ చాలా మంది ఉద్యోగులు దీనికి అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో, టీసీఎస్ వంటి అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, భారత ఐటీ కంపెనీలలో ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తూ వచ్చింది. ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు వచ్చి, మిగతా రోజులు ఇంటి నుంచి పని చేయవచ్చని ప్రకటించింది.

అయితే, కొన్ని నెలల క్రితం 'జాబ్ లెవెల్ 7' స్థాయిలో ఉన్న ఉద్యోగులు వారానికి 4 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ప్రకటించింది. ఇప్పుడు తాజాగా 'జాబ్ లెవెల్ 6 ప్లస్' స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేసింది.
మొదట సీనియర్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి అధికారులు వారానికి నాలుగు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించింది. ఇప్పుడు 'జాబ్ లెవెల్ 6 ప్లస్' కేటగిరీలోని ఉద్యోగులు కూడా వారానికి నాలుగు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
ఈ నిబంధనను దశలవారీగా ఉద్యోగులందరికీ వర్తింపజేస్తారని సమాచారం. ఇకపై మీరు వారానికి నాలుగు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని మానవ వనరుల (హెచ్‌ఆర్) అధికారులు ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేశారు. ప్రతి నెలా ఎంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారనే డేటాను హెచ్‌ఆర్ అధికారులు సమీక్షిస్తారని కూడా అందులో పేర్కొన్నారు.
మొదట్లో నెలలో వరుసగా 10 రోజులు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ ఇప్పుడు, ఆ 10 రోజులను నెలలోని ప్రతీ వారానికి విభజించుకోవాలని, అంటే ప్రతీ వారం ఆఫీసుకు రావాల్సిందేనని సీనియర్ అధికారులు జూనియర్లకు చెబుతున్నారట. దీన్నిబట్టి చూస్తే, ఇన్ఫోసిస్ కూడా క్రమంగా ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించే ప్రక్రియను వేగవంతం చేసిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే జనవరి నెలలో, ఇంటి నుంచి పని చేసే రోజుల పొడిగింపునకు ఇన్ఫోసిస్ కఠినమైన నిబంధనలను జారీ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications