Infosys News: మరింత నిరాశలోకి ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. సిబ్బంది ఆశలు గల్లంతు
Infy Variable pay: రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఇంధన సంక్షోభం మొదలైన అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ భారతీయ IT కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయి. దిగ్గజ IT కంపెనీల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే ఆ ఫలాలను ఉద్యోగులకు పంచేందుకు మాత్రం మొహం చాటేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయమే దీనికి ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలో రెండో అతిపెద్ద IT సంస్థగా ఇన్ఫోసిస్ ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఈసారి Q4లో ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఉద్యోగులకు ఇచ్చే బోనస్, వేరియబుల్ పే విషయంలో మాత్రం ఆచితూచి కఠినంగా వ్యవహరిస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే భారీగా కట్ చేయడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 60 శాతం వేరియబుల్ పే ఉద్యోగులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గత మెయిల్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇచ్చారట. దీంతో జీతాల పెంపు విషయంలో ఇప్పటికే గుర్రుగా ఉన్న ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. దిగ్గజ IT సంస్థ TCS కూడా కిందిస్థాయి ఉద్యోగులకు 100 శాతం ఇవ్వంగా ఇన్ఫీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో కంగు తిన్నారు.
అంతకు ముందు త్రైమాసికాల్లో వరుసగా 73, 80, 75 శాతాల చొప్పున ఇన్ఫోసిస్ వేరియబుల్ పే అందించింది. అయితే ఈసారి మాత్రం 60 శాతంతో సరిపెట్టింది. అయితే ఉద్యోగుల స్థాయిల ఆధారంగా ఇందులో కొంత మార్పు ఉన్నట్లు సమాచారం. మంచి పనితీరు కలిగిన ఉద్యోగులకు 85 శాతం వరకు ఆఫర్ చేశారని వినికిడి. ఈనెల వేతనంతో పాటుగా సదరు మొత్తం ఉద్యోగుల ఖాతాలకు జమకానుంది.


Click it and Unblock the Notifications