IT News: దేశీయ టెక్ దిగ్గజ సంస్థల్లో ఇన్ఫోసిస్ ఒకటిగా కొనసాగుతోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తూ, అటు భారత వాణిజ్యానికి ఇటు నిరుద్యోగిత రేటు తగ్గించడానికి తన వంతు కృషి చేస్తోంది. ఇవే కాకుండా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున CSR ఇనీషియేటివ్ కింద పలు సామాజిక కార్యక్రమాలను సైతం చేపడుతోంది.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నిరుపేద మహిళలకు అండగా నిలవాలని టెక్ దిగ్గజం భావిస్తోంది. కంపెనీ దాతృత్వ విభాగం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా 100 కోట్ల విలువైన స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. మొదటి దశలో భాగంగా ప్రముఖ కళాశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(STEM) విభాగాల్లో చదువుతున్న వారికి ప్రాముఖ్యత ఇవ్వనుంది.

ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. 2 వేల మంది మహిళలకు నాలుగేళ్లపాటు స్కాలర్ షిప్ ఇవ్వనుంది. 'STEM స్టార్స్' పేరిట నిర్వహించనున్న ఈ ఉపకారవేతనం వల్ల ఓ అభ్యర్థి లక్ష వరకు లబ్ధి పొందవచ్చు. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వ్యయం సహా స్టడీ మెటీరియల్ ఖర్చలు కవర్ చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
'ఇండియాలో పేదరికం వల్ల చాలా మంది యువత ఉన్నత విద్యను అభ్యసించడానికి దూరమవుతోంది. అందులోనూ మహిళలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. స్కాలర్ షిప్స్ రూపంలో వారికి సహకారం అందిస్తే, ఉద్యోగాల్లో లింగ సమతుల్యత సమస్యకు సైతం చెక్ పెట్టినట్లే' అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణి తెలిపారు. ప్రారంభ ఏడాదిలో NIRF గుర్తింపు పొందిన కాలేజీలను మాత్రమే ఈ ఉపకార వేతనం కవర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications