Infosys: విశాఖలో ఈ నెల 28 నుంచి ఇన్ఫోసిస్ కార్యకాలాపాలు ప్రారంభం కానున్నాయి..
భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో త్వరలో ప్రారంభం కానుంది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నం.2లో ఇన్ఫోసిస్ కార్యకాలాపాల కోసం భారీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఏర్పాట్లు చేసుకోంటోంది. గతంలో శాటిలైట్ ఆఫీస్ పెడతామని ప్రకటించిన ఇన్ఫోసిస్.. ఇప్పుడు డెవలప్‌మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేసింది.
కంపెనీ 2022 అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే దాని కార్యాలయం స్థానం సరైన సమయంలో ఖరారు కానందున ఆలస్యమైంది. చివరకు రుషికొండలోని ఐటీ సెజ్‌లో సరైన సమయంలో బ్రాంచ్ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇన్ఫోసిస్ తొలివిడతలో 650 మంది సామర్థ్యంతో సేవలు అందించనుంది. ఈ సంఖ్య త్వరలోనే 1000 మంది చేరే అవకాశం ఉంది. తమ క్యాంపస్‌కు ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న అభ్యర్థుల్ని ఇప్పటికే ఇన్ఫోసిస్ ఆహ్వానించినట్లు సంస్థ అధికారులు ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం కృషితో దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ప్రారంభంతో సాగర నగరానికి కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన సాగించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో విశాఖపట్నం ప్రముఖ నగరంగా ఆవతరించే అవకాశం ఉంది.
విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. డేటా సెంచర్ తో దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అతి త్వరలోనే విశాఖపట్నం ఐటీ హబ్‌గా అవతరించనుందని ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.


Click it and Unblock the Notifications