తయారీ, విద్యుత్ ఎఫెక్ట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3.6% వృద్ధి
అక్టోబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 3.6 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. తయారీ, విద్యుత్ ఉత్పత్తి రంగాలు మంచి పనితీరు సాధించడమే ప్రధాన కారణం. ఈ ఏడాది అక్టోబర్‌లో తయారీ రంగంలో 3.5 శాతం, విద్యుదుత్పత్తి రంగంలో 11.2 శాతం చొప్పున వృద్ధి నమోదయింది. అయితే మైనింగ్ రంగంలో వృద్ధి 1.5 శాతం క్షీణించినట్లు అధికారికంగా విడుదలైన ఐఐపీ(ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) గణాంకాలు వెల్లడించాయి. గత 2019లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది.

ఎనిమిది నెలల గరిష్టానికి..
అక్టోబర్ నెలలో 3.6 శాతం వృద్ధి ఎనిమిది నెలల గరిష్టం. చివరిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 5.2 శాతంగా నమోదయింది. కరోనా పరిణామాల కారణంగా మార్చి నుండి ఆగస్ట్ వరకు ప్రతికూలస్థాయిలో నమోదయింది. సెప్టెంబర్‌లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వల్ల ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి చివరి వారంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు..
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక ఏడాది ఇదే సమయంలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్‌లో ఐఐపీ క్షీణత 6.6 శాతంగా ఉంది. అయితే తయారీ రంగం 3.5 శాతం, విద్యుదుత్పత్తి 11.2 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 17.6 శాతం, నాన్ డ్యూరబుల్స్ 7.5 శాతం వృద్ధిని చేశాయి. గనుల రంగం మాత్రం 1.5 శాతం క్షీణతను నమోదు చేసింది.

బలహీనంగానే..
ఐఐపీ 8 నెలల గరిష్టానికి పెరిగినప్పటికీ అక్టోబర్ డేటా ఊహించిన దాని కంటే బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఎకానమీ రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చనని, గతంలోనూ ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. సానుకూల గణాంకాలు కనిపించినప్పటికీ ఇదే ధోరణి కొనసాగకపోవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications