IndusInd bank: అంచనాలు మించి రాణించిన ఇండస్ ఇండ్ బ్యాంక్.. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది!
IndusInd bank: ప్రైవేట్ రంగంలో ఆర్థిక సేవలు అందిస్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మార్కెట్ వర్గాల అంచనాలను అధిగమించి ముందుకు దూసుకెళ్లింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు అసెట్ క్వాలిటీ సైతం మెరుగుపడింది. డిపాజిట్లలోనూ మంచి వృద్ధిని కనబరిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈ క్వార్టర్లో 2 వేల 202 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పింది. తద్వారా విశ్లేషకుల అంచనాలను సైతం అధిగమించినట్లైంది.

వడ్డీ రూపంలోని ఆర్జించిన ఆదాయం, ఖాతాదారులకు చెల్లించిన ఇంటరెస్ట్ మధ్య వ్యత్యాసం 5 వేల 76 కోట్లుగా ఉన్నట్లు ఇండస్ ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికానికి పోస్ట్ చేసిన 4 వేల 302 కోట్ల కంటే ఈసారి 18 శాతం ఎక్కువగా సంపాదించగలిగినట్లు తెలిపింది. నిరర్థక ఆస్తులు గతేడాది 2.11 శాతం ఉండగా ఇప్పుడు 1.93 శాతానికి తగ్గినట్లు వివరించింది.
మొత్తం డిపాజిట్లు 3.15 నుంచి 3.59 లక్షల కోట్లకు చేరాయి. అంటే ఈ విభాగంలో 14 శాతం వృద్ధి కనబరిచింది. కరెంటు మరియు సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 1.41 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డిపాజిట్లలో CASA డిపాజిట్లు 39 శాతంగా ఉన్నాయి. ఇక అడ్వాన్స్ లలోనూ 21 శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది. గతంలోని 2.60 లక్షల నుంచి 3.15 లక్షల కోట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications