IndiGo: టాటాలకు గట్టి పోటీ ఇస్తున్న ఇండిగో.. ఆకాశ వీధుల్లో పెరుగుతున్న హీట్..
IndiGo: దేశీయ విమానయాన రంగంలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న ఇండిగో టాటాల ఎయిర్ ఇండియాకు పోటీ ఇవ్వటంలో తగ్గేదే లేదంటోంది. ఇందుకోసం ప్యారిస్ ఎయిర్ షో వేదికగా చారిత్రాత్మక డీల్ ప్రకటించింది.
యూరోపియన్ ఏవియేషన్ కంపెనీ ఎయిర్ బస్‌లోని A320 కుటుంబానికి చెందిన 500 విమానాలకు ఆర్డర్ పెట్టింది. చరిత్రలో ఎయిర్ బస్ కంపెనీకి ఇంత పెద్ద సంఖ్యలో విమానాల ఆర్డర్ చేయలేదని ఇండిగో ప్రకటించింది. ఈ మెగా కొనుగోలు డీల్ విలువ 55 బిలియన్ డాలర్లని తెలుస్తోంది. పెద్ద ఆర్డర్ కారణంగా కంపెనికి తక్కువ ధర ప్రయోజనం లభించనుంది.

దీనికి ముందు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 2022 ఫిబ్రవరిలో 470 విమానాల కోసం మెగా ఆర్డర్ పెట్టింది. బోయింగ్ సంస్థతో చేసుకున్న ఈ డీల్ విలువ దాదాపు 70 బిలియన్ డాలర్ల విలువైనదిగా వెల్లడైంది. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో మెజారిటీ కస్టమర్లకు కలిగి ఉన్న ఇండిగో రెండు దశాబ్దాల్లోనే స్టార్టప్ కంపెనీ స్థాయి నుంచి 60 శాతం మార్కెట్ వాటా పొందింది. ఇదే క్రమంలో గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఆకాశ కూడా తన సేవలను విస్తరించేందుకు నిధులను సమీకరిస్తోంది.

ప్రస్తుతం ఇండిగో 300లకు పైగా విమానాలతో సేవలను కొనసాగిస్తోంది. ఈ కంపెనీకి ఇప్పటికే ఆర్డర్ పెట్టిన 480 విమానాల డెలివరీ పూర్తికావాల్సి ఉంది. అయితే తాజాగా కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయటం ద్వారా 2030-2035 నాటికి స్థిరమైన డెలివరీలను పొందుతుందని తెలుస్తోంది. 2006లో గురుగ్రామ్ కేంద్రంగా సేవలను ప్రారంభించిన కంపెనీ ఇప్పటి వరకు మెుత్తంగా 1,330 విమానాలకు ఎయిర్ బస్ వద్ద ఆర్డర్ పెట్టింది.


Click it and Unblock the Notifications