Indigo Vs Air India: భారత విమానయాన రంగం ప్రస్తుతం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఇటీవల అధిక పోటీతో పాటు నిధుల కొరత వల్ల అనేక ఎయిర్ లైన్ కంపెనీలు ఏవియేషన్ రంగంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే.
పెరిగిన ప్రజల అవసరాలు, జీవనవిధానంతో విమాన ప్రయాణం సాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద నగరాలు, చిన్న నగరాల మధ్య సర్వీసులు పెరిగాయి. దీంతో వేగవంతమైన ప్రయాణం కోసం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా మరింత ఎక్కువగా విమాన ప్రయాణం ప్రారంభించారు.

ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో డిసెంబర్ 18న సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఏకంగా 100 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి చరిత్ర సృష్టించింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 18 మధ్య కాలంలో 10 కోట్ల మందికి సేవలు అందించి పెద్ద బెంచ్ మార్క్ ఏవియేషన్ పరిశ్రమలో సృష్టించింది. దీంతో కంపెనీ ప్రపంచంలోని టాప్-10 గ్లోబల్ ఎయిర్‌లైన్స్ క్లబ్‌లో చేరింది.
ప్రయాణికుల రద్దీతో అగ్రగామిగా నిలిచినట్లు ఇండిగో పేర్కొంది. కంపెనీ ప్రధానంగా డొమెస్టిక్ సేవలను టార్గెట్ చేసుకుని అధిక రాబడిని, లాభాలను పొందుతోంది. అలాగే 2023 ప్రథమార్థంలో తన సేవా జాబితాకు 20 విదేశీ మార్గాలను జోడించింది. నవంబర్ డేటా ప్రకారం ఇండియన్ ఏవియేషన్ పరిశ్రమలో ఇండిగో 61.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
అయితే ప్రస్తుతం టాటాలు సైతం ఇండియాలో అగ్రగామి సంస్థగా ఎదగాలని చూస్తున్నారు. ఇండిగో మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. టాటా ఎయిర్ ఇండియాను వెనకకు నెట్టిన ఇండిగో తన ఆధిపత్యాన్ని చాలా కాలంగా స్థిరంగా కొనసాగిస్తోంది. అయితే 40 కంటే ఎక్కువ విమానాలు మరమ్మతుల కోసం గ్రౌండ్ కావటంతో కంపెనీ షేర్లు జనవరిలో క్షీణించాయి. పోటీ విషయంలో ఏమాత్రం వెనకపడకూడదనే లక్ష్యంతో కంపెనీ టాటాలతో సమానంగా 500 కొత్త విమానాల కోసం ఆర్డర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీ నేపథ్యంలో ఇండిగో ప్రయాణికుల మార్కును ఎయిర్ ఇండియా ఎన్నాళ్లకు అందుకుంటుందోనని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications