రుచించని నిర్మలమ్మ భారీ ప్యాకేజీ, భారీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందున నిన్న స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే నిర్మలా సీతారామన్ మొదటి రోజు ఇచ్చిన ప్యాకేజీ వివరణ మార్కెట్లకు రుచించలేదు. దీంతో ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16కు సెన్సెక్స్ 592.33 పాయింట్లు లేదా 1.85% నష్టపోయి 31,416.28 వద్ద, నిఫ్టీ 166.85 పాయింట్లు లేదా 1.78% పాయింట్లు నష్టపోయి 9,216.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 287 షేర్లు లాభాల్లో, 460 షేర్లు నష్టాల్లో ఉండగా, 38 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ప్రధాని మోడీ మంగళవారం రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు, రియల్ ఎస్టేట్‌కు, డిస్కంలకు ఇచ్చే ఉద్దీపనలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న వివరించారు. సమాజంలోని వివిధ వర్గాలతో చర్చించాక విజన్ రూపొందించినట్లు చెప్పారు. ప్రధాని మోడీ మార్గనిర్దేశనం చేశారన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి దిశగా భారత్‌ను నడిపేందుకు ఈ ప్యాకేజీ అన్నారు. అయితే నిర్మల ప్యాకేజీ వివరణ మార్కెట్ సెంటిమెంటును బలపరచలేకపోయింది.

ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్తాయని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ మరోసారి మరిన్ని ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తారు. ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.15 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, బ్రిటానియా, నెస్ట్లే, సన్ ఫార్మా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, హిండాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉన్నాయి.


Click it and Unblock the Notifications