స్టాక్ మార్కెట్లు బుధవారం(మే 11) లాభాల్లో ప్రారంభమై, అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా సూచీలు కూడా మిశ్రమంగానే కదలాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నష్టాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కీలక స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో సూచీలు ప్రారంభంలో సానుకూలంగా కదలాడాయి. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజుల భారీ నష్టాల అనంతరం నేడు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, నిలబడలేదు.
సెన్సెక్స్ ఉదయం 54,544.91 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,764.42 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 54,598.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,270.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,071.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 16,318.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.15 సమయానికి సెన్సెక్స్ 373 పాయింట్లు క్షీణించి 53,991 పాయింట్ల వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు క్షీణించి 16,131 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం మంచి లాభాలను నమోదు చేస్తున్నాయి. ప్రీమియర్ సింత్, పటేల్ ఇంటిగ్రేట్ వంటి స్టాక్స్ వరుసగా 12.57 శాతం, 10.08 శాతం లాభాల్లో ఉన్నాయి. గలాక్టికో కార్పోరేట్, సీడబ్ల్యుడీ లిమిటెడ్, అవ్రో ఇండియా, క్వాడ్రాంట్ టెలి 52 వారాల గరిష్టాన్ని తాకాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్, ఐటీ సూచీలు 0.5 శాతం నుండి 1 శాతం మేర క్షీణించాయి. స్మాల్ క్యాప్స్ 2 శాతం మేర పడిపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, HDFC లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, భారతీ ఎయిర్ టెల్, సిప్లా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ, లార్సన్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications