వరుసగా నాలుగు రోజుల పాటు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు (గురువారం, జూన్ 16) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అయితే కాసేపటికి లాభాలు తగ్గాయి. క్రితం సెషన్‌లో 52,541 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు 53,000 పాయింట్లను క్రాస్ చేసి, ప్రారంభించింది. కానీ అంతలోనే ఈ మార్కు దిగువకు వచ్చింది. సెన్సెక్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో పోలిస్తే దాదాపు 9500 పాయింట్లు తక్కువగా ఉంది.
సెన్సెక్స్ ఉదయం 53,018 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,142 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,717 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,832 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15.863 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15.,718 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.40 సమయానికి 243 పాయింట్లు ఎగిసి 52,761 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47.60 పాయింట్లు లాభపడి 15,739 పాయింట్ల వద్ద కదలాడింది.

ఇటీవల కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో గత ఐదు వారాల్లో 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. తాజాగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. అమెరికా ద్రవ్యోల్భణం మే నెలలో 41 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. దీనిని అదుపు చేసేందుకు ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచింది. తాజా పెంపుతో ప్రామాణిక ఫెడరల్ ఫండ్ రేట్లు 1.5 శాతం నుండి 1.75 శాతానికి చేరాయి.


Click it and Unblock the Notifications