భారీ ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, మెటల్ మాత్రం లాభాల్లో...
వరుసగా రెండు రోజుల పాటు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 13) ఊగిసలాటలో కదలాడుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికి స్వల్ప నష్టాల్లోకి జారుకొని, తిరిగి కోలుకుంది. మొత్తానికి లాభాల్లో కనిపిస్తున్నప్పటికీ ఊగిసలాటలో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 58,576 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మాత్రం 58,910 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,514 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు ఉదయం ఓ సమయంలో 59,000 మార్కును దాటింది. అంటే క్రితం సెషన్‌తో పోలిస్తే ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ అంతలోనే ఫ్లాట్‌కు వచ్చింది.
మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 58,599 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 17,549 పాయింట్ల వద్ద ఉంది. ఐటీ రంగం మినహా మిగతా అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు ఒక శాతం చొప్పున లాభాల్లో ఉన్నాయి. ఉదయం సెషన్‌లో బీఎస్ఈలో ఐటీ, ఆటో మాత్రమే నెగిటివ్‌గా ఉన్నాయి. ఎన్ఎస్ఈలో ఐటీ, ఫార్మా నెగిటివ్‌గా ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 75.69 వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ గత రెండు సెషన్‌లలో 871 పాయింట్లు కుప్పకూలింది. కానీ నేడు భారీ ఊగిసలాటలో కనిపిస్తోంది. మార్చి నెలలో ద్రవ్యోల్భణం పదిహేడు నెలల గరిష్టానికి చేరుకుంది. ఈ ప్రభావం సూచీలపై పడింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం ఎక్కువగా నేడు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications