బీజేపీ గెలుపు, రష్యా-ఉక్రెయిన్ చర్చలు: మూడో రోజు లాభాల్లో మార్కెట్లు
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు క్షీణించడానికి తోడు దేశీయంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఐదింట నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడం లేదా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ముఖ్యంగా రాజకీయంగా ఉత్తర ప్రదేశ్ ఏ పార్టీకి అయినా కీలకం. ఈ రాష్ట్రంలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఇది మార్కెట్ పరుగుకు కారణమైంది. 2024 ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి ఫలితాలు అనుకూలంగా ఉండటంతో వరుసగా మూడో రోజు బుల్ రన్ కనిపించింది.
సెన్సెక్స్ ఉదయం 56,242 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,242 పాయింట్ల వద్దే గరిష్టాన్ని తాకింది. 54,982 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 817 పాయింట్లు ఎగిసి 55,464 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి గరిష్టం నుండి దాదాపు 800 పాయింట్లు క్షీణించింది. నేడు ఓ సమయంలో 1600 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ నేడు 56,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. కానీ చివరకు ఈ దిగువనే ముగిసింది. నిఫ్టీ 249 పాయింట్లు లాభపడి 16,594 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 16,757 పాయింట్లను తాకింది.

అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా ఉండటం, ముఖ్యంగా యూపీలో బీజేపీ కూటమి విజయం సాధించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ రాష్ట్ర ఫలితాల ఆధారంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండటంతో సంస్కరణల వేగం కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా మధ్య సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాక్, యూఏఈ సహా ఒపెక్ దేశాల నుండి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలు ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేశాయి. దీంతో కమోడిటీ ధరలు దిగి వచ్చాయి.


Click it and Unblock the Notifications