WPI Inflation: అక్టోబర్లో పెరిగిన ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్ల పెంపు ఖాయమేనా..!
అక్టోబర్ లో భారతదేశ హోల్సేల్ ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. సెప్టెంబర్ లో 11.39 శాతం ఉన్న ద్రవ్యోల్బణం అక్టోబర్ లో 12.29 శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్, ప్రాథమిక వస్తువులు, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం వస్తువుల డబ్ల్యూపీఐ 113.3 వద్ద ఉండగా.. సెప్టెంబర్లో ఇది 112.5గా ఉంది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్లోని 25.85 శాతం నుంచి అక్టోబర్లో 32.84 శాతానికి గణనీయంగా పెరిగింది.
ప్రాథమిక వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్లోని 8.67 శాతం నుంచి 9.24 శాతానికి చేరుకుంది. అయితే తయారీ ఉత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలోని 9.76 శాతం నుంచి 9.54 శాతానికి స్వల్పంగా తగ్గింది. అక్టోబర్లో ప్రాథమిక వస్తువులు సూచీ 120.6, ఇంధనం, విద్యుత్ సూచీ 115.7, తయారీ ఉత్పత్తుల సూచీ 110.2 వద్ద ఉన్నాయి. ఖనిజ నూనెలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్, ఆహార పదార్థాలు, ప్రాథమిక లోహాలు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, ఆహారేతర వస్తువులు, వస్త్రాలు, అలాగే రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఈ నెలలో హోల్సేల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణాలుగా ప్రభుత్వం పేర్కొంది.

డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్లోని 8.66 శాతం ఉండగా.. అక్టోబర్లో 8.58 శాతానికి తగ్గింది. ప్రాథమిక వస్తువుల పరిధిలోకి వచ్చే ఆహార పదార్థాలు, తయారీ ఆహార ఉత్పత్తులను కలిపి రూపొందించే ఈ ఫుడ్ ఇండెక్స్, WPIలో దాదాపు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం(CPI) కూడా అక్టోబర్లో 6.09 శాతానికి పెరిగింది. గత రెండేళ్లలో తొలిసారిగా రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన అప్పర్ లిమిట్ 6 శాతాన్ని దాటింది. హోల్సేల్ అండ్ రిటైల్ ద్రవ్యోల్బణం రెండు రకాలుగానూ ఇలా ఎగబాకడం ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిస్థితులతో రాబోయే డిసెంబర్ నెలలో జరిగే రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. పెరిగిపోతున్న ధరల కట్టడికి కేంద్ర బ్యాంకు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆర్బీఐ ఇప్పటికే అక్టోబర్ లో రెపో రేటు పెంచింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications