ట్రాన్సాక్షన్స్‌కు క్రిప్టోకరెన్సీ కంటే UPI బెట్టర్, కానీ...: నందన్ నీలేకని
క్రిప్టోకరెన్సీ కంటే భారత యూపీఐ చాలా బెట్టర్ అని ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ఆయన మంగళవారం ఈఎఫ్ సీఎఫ్ఓ అవార్డ్స్ 2020 కార్యక్రమంలో మాట్లాడారు. క్రిప్టోకరెన్సీ భారత్‌లో ఆమోదయోగ్యమేనని, కానీ దేశానికి అంతకుమించిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, కాబట్టి క్రిప్టోకరెన్సీ మనకు అంత అనువైనది కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా డిజిటల్ ఎకానమీలు డేటా గుత్తాధిపత్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సమయంలో, భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రజాస్వామీకరణకు మార్గం వేసిందన్నారు.

బిట్ కాయిన్ పోటీ కాదు
నా అభిప్రాయం ఏమంటే భారత్‌లో క్రిప్టోకరెన్సీని ట్రాన్సాక్షన్ కరెన్సీగా భావించవద్దని, ఎందుకంటే ఇది భారత్‌లోని యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ట్రాన్సాక్షన్స్ సామర్థ్యానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని నందన్ నీలేకని అన్నారు. యూపీఐ ద్వారా నెలకు 2.3 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తయారు చేసిన ఈ పేమెంట్ సాధనం ద్వారా 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ దాదాపు జీరో ఖర్చుతో కొనసాగుతున్నాయని తెలిపారు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ సామర్థ్యానికి సంబంధించి బిట్ కాయిన్ ఎప్పటికీ పోటీ కాదన్నారు.

పరిగణలోకి తీసుకోవాలి
బంగారం, రియల్ ఎస్టేట్ వంటివి నిలిచే ఆస్తులు అని, దాని చుట్టూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని నందన్ నీలేకని అన్నారు. క్రిప్టోకరెన్సీ నమూనాను ఒక అసెట్ క్లాస్‌గా కలిగి ఉండాలన్నారు. దీనిపై పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ దీనిని వ్యవస్థలోకి తీసుకు రావాలన్నారు. ఈ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఈ డిజిటల్ కరెన్సీ ప్రారంభాన్ని ఆర్బీఐ, కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది అందరికీ చేరడానికి యూపీఐ పంపిణీ నిర్మాణం ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఇలా మరే దేశం చేయలేదన్నారు. యూపీఐ మల్టిపుల్ స్టోర్డ్ వ్యాల్యూ ఖాతాలను అనుమతిస్తుందన్నారు.

యూపీఐ ఖాతాలో...
యూపీఐలో ఒకరికి బ్యాంకు ఖాతా, వ్యాలెట్, బిట్ కాయిన్ ఖాతా లేదా డిజిటల్ కరెన్సీ ఖాతా కలిగి ఉండవచ్చునని నీలేకని అన్నారు. భారత డిజిటల్ వ్యవస్థను అమెరికాతో పోల్చడం సరికాదని, ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు చాలా భిన్నమైనవి అన్నారు.


Click it and Unblock the Notifications