ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ శ్రమకు గుడ్ బై.. ప్రభుత్వ కొత్త పథకం కింద ప్రతి ఇంటికీ గ్యాస్‌ను అందిస్తుంది..
దేశంలోని సామాన్య గృహ వినియోగదారులకు వంటగ్యాస్ కష్టాలను దూరం చేయడంతో పాటు.. పర్యావరణహితమైన పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. దేశంలో గృహ వినియోగ సహజ వాయువు కనెక్షన్ల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా గృహ వినియోగ PNG కనెక్షన్ల ప్రోత్సాహక పథకం అనే కొత్త విధానాన్ని ఆమోదించింది. రాబోయే సెప్టెంబర్ 1, 2026 నుండి అమలు కానున్న ఈ పథకం.. అటు పంపిణీ సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తూనే, ఇటు ప్రభుత్వానికి అయ్యే భారీ దిగుమతి ఖర్చులను తగ్గించేందుకు దోహదపడనుంది.
సాధారణంగా గృహాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ ఇచ్చే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. పర్యవసానంగా, వినియోగదారులకు గ్యాస్ అందివ్వడానికి విదేశాల నుండి అత్యంత ఖరీదైన ఎల్‌ఎన్‌జీ (LNG)ని కొనుగోలు చేస్తూ ఆర్థిక భారంతో సతమతమవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఒక వినూత్న ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

దీని ప్రకారం తమ పరిధికి నిర్దేశించిన పరిమితికి మించి పొందిన ప్రతి అదనపు గృహ వినియోగ పీఎన్‌జీ కనెక్షన్‌కు కంపెనీలకు 200 SCM చొప్పున అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం (APM) గ్యాస్‌ను ప్రభుత్వం అదనంగా కేటాయిస్తుంది. దేశీయంగా తక్కువ ధరకు లభించే ఈ గ్యాస్ వల్ల కంపెనీలు ఖరీదైన ఎల్‌ఎన్‌జీ కొనుగోలును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా, ఆదా అయిన ఈ గ్యాస్‌ను వారు సిఎన్‌జీ రవాణా విభాగానికి వాడుకోవచ్చు. దీనివల్ల కంపెనీల మొత్తం గ్యాస్ సేకరణ ఖర్చులు ఊహించని రీతిలో తగ్గుతాయి.
ఈ అదనపు కేటాయింపుల వల్ల కలిగే లాభాలు సిజిడి కంపెనీలలో పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపనున్నాయి. గతంలో గ్యాస్ నెట్‌వర్క్ నిర్మించిన కంపెనీలు తమ పెట్టుబడిని తిరిగి పొందడానికి దాదాపు పది సంవత్సరాల సమయం పట్టేది. కానీ ప్రభుత్వం అందిస్తున్న ఈ కొత్త ప్రోత్సాహకాల వల్ల పేబ్యాక్ పీరియడ్ పది సంవత్సరాల నుండి కేవలం మూడు సంవత్సరాలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కొత్త ప్రాంతాలలో భూగర్భ పైప్‌లైన్లను విస్తరించి, మరింతమంది ప్రజలకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కంపెనీలను ఆర్థికంగా బలంగా ప్రోత్సహిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల చొప్పున రెండు విడతలలో అమలు చేయనున్నారు.
భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 1.74 కోట్ల పీఎన్‌జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత వేగంగా పెంచడమే కాకుండా, గతంలో కనెక్షన్ ఉండి కూడా వాడని లేదా ఇన్-యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను మళ్లీ పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసమే 'నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0' అనే వినూత్న ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అలాగే, ఈ విప్లవాత్మక మార్పుకు రాష్ట్రాల భాగస్వామ్యం కూడా అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, సహజ వాయువుపై విధించే వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలను కోరింది.
చివరగా వినియోగదారుల కోణం నుండి చూస్తే ఇది అత్యంత సౌకర్యవంతమైన మార్పు. ఎల్‌పిజి సిలిండర్లతో పోలిస్తే పీఎన్‌జీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకోవడం, అది అయిపోయే వరకు నిరీక్షించడం, బరువైన సిలిండర్లను మోయడం వంటి శ్రమలన్నీ తొలగిపోతాయి. పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అవుతుంది. అంతేకాకుండా విద్యుత్ బిల్లు తరహాలోనే మీటర్‌లో నమోదైన వాస్తవ వినియోగానికి మాత్రమే బిల్లు చెల్లించే సదుపాయం ఉంటుంది. పీఎన్‌జీ వాయువు గాలి కంటే తేలికగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు లీకేజ్ అయినా సులభంగా ఆవిరైపోతుంది, తద్వారా ప్రమాదాల భయం చాలా వరకు తగ్గుతుంది. మొత్తానికి ఈ ప్రోత్సాహక పథకం దేశీయ ఇంధన రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ఇటు ప్రభుత్వానికి, అటు పంపిణీ సంస్థలకు, ప్రజలకు ముప్పేట ప్రయోజనం చేకూర్చనుంది.


Click it and Unblock the Notifications
