రూ.160 లక్షల కోట్లకు చేరిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్
గతవారం ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈక్విటీ మార్కెట్లు బుల్లిష్‌గా ముగియడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రికార్డ్ స్థాయికి చేరుకుంది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిస్టయిన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.160.68 లక్షల కోట్లకు ఎగబాకింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ మార్క్ అందుకోవడం ఇదే మొదటిసారి. వరుసగా ఏడోరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో క్లోజ్ అయ్యాయి.
ఏడాది తర్వాత ఇది మొదటిసారి. శుక్రవారం సెన్సెక్స్ 326 పాయింట్లు లాభపడి 40,509 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1,60,68,725.10 కోట్లకు చేరుకుంది. డాలర్ వ్యాల్యూలో 2.11 ట్రిలియన్ డాలర్లకు చేరింది. శుక్రవారం నిఫ్టీ 80 పాయింట్లు లాభపడటంతో 11,914.20 వద్ద క్లోజ్ అయింది. గతవారంలో సెన్సెక్స్ 1,812 పాయింట్లు, నిఫ్టీ 497 పాయింట్లు లాభపడింది.

ఆర్బీఐ నిర్ణయంతో ఈ స్టాక్స్ ఎగిసి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై యథాతథ నిర్ణయం తీసుకోవడంతో ఆర్థికరంగ షేర్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. కొనుగోళ్లు పెరిగాయి. ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీకి సంబంధించిన స్టాక్స్‌తో పాటు ఫైనాన్షియల్ రంగ షేర్లు ఎగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఆర్‌బీఎల్ బ్యాంకు, ఎస్బీఐ, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్స్ నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. ఎల్ఐసీ హౌజింగ్, పీఎన్బీ హౌజింగ్, జీఐసీ హౌజింగ్, ఇండియాబుల్స్ హౌజింగ్ షేర్లు ఏడు శాతానికి పైగా లాభపడ్డాయి.

ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా
ప్రపంచ టాప్ 10 మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత్ దిగువ స్థానంలో ఉంది. ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత్ వాటా 2.3 శాతంగా ఉంది. గతంలో ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో 2.5 శాతంతో రికార్డ్‌స్థాయిని తాకింది. సెన్సెక్స్ గురువారం 40,000 మార్క్‌ను తాకి, ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయికి మొదటిసారి చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ త్రైమాసిక ఫలితాల అనంతరం మార్కెట్లు పుంజుకున్నాయి.

మార్కెట్లో వాటా..
మార్చి నెల నుండి బీఎస్ఈ మిడ్ క్యాప్ 53 శాతం లాభపడింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 71 శాతం, బీఎస్ఈ 500 స్టాక్స్ 57 శాతం ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ ఇదే కాలంలో 55 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్, బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్‌లో వరుసగా 49.06 శాతం, 13.70, 14.25 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. జనవరిలో ఈ వాటా 48.39 శాతం, 13.30 శాతం, 13.71 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications