India AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. మానవ జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు, అధిక ఉత్పాదకతకు AIని విస్తృతంగా వినియోగించుకోవాలని టెక్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ఇదే సమయంలో భారీ ఆర్థిక ప్రణాళికతో భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దీనికి మద్ధతుగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇండియా AI ప్రాజెక్టులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఇనీషియేటివ్‌ను ప్రారంభించనుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో AI-ఎనేబుల్డ్ చిప్‌మేకింగ్‌కు మద్దతు ఇవ్వడానికి డేటాసెట్ ప్లాట్‌ఫారమ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు .

'ఇండియా డేటాసెట్స్ ప్లాట్‌ఫారమ్ లోని పలు డేటాసెట్‌లను తమ మల్టీ-పెరామీటర్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి భారతీయ పరిశోధకులు ఉపయోగించుకోవచ్చు. మరో PPP ప్రాజెక్ట్ ఇండియా AI కంప్యూట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్టార్టప్‌లతో పాటు మోడల్స్‌కు శిక్షణ ఇచ్చే ఇతర పరిశోధకుల కోసం గణనీయమైన GPU సామర్థ్యాన్ని సృష్టించనున్నాం' అని కేంద్ర ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రకటించారు.
సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ భాగస్వామ్యంతో AI చిప్‌ల అభివృద్ధికి ఈ చర్యలు తోడ్పడుతతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో AI పుష్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 వర్కింగ్ గ్రూపులు.. 4 నెలల చర్చల తర్వాత తమ నివేదికలను సమర్పించినట్లు చెప్పారు. 'ఇది భవిష్యత్ తరాల కోసం ఉద్దేశించిన దశాబ్దాల రోడ్ మ్యాప్. ChatGPT లేదా జనరేటివ్ AI మీద వ్యామోహంతో తీసుకున్న నిర్ణయం కాదు' అని స్పష్టం చేశారు.
రెండు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చంద్రశేఖర్ వివరించారు. ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీలో 'ఇండియా AI'ని భాగం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, వైద్య, విద్య, ఫిన్‌టెక్, సెక్యూరిటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాల్లో AI ని ఉపయోగించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్ కోసం నేషనల్ స్ట్రేటజీ విడుదల చేయగా.. అక్టోబర్ 31 వరకు ప్రజలకు ముసాయిదా అందుబాటులో ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications