ఏఐ దెబ్బకు బ్యాంక్ ఉద్యోగం కూడా గ్యారంటీ లేదు...7 700 మంది ఉద్యోగులను తొలగించిన టాప్ బ్యాంకింగ్ దిగ్గజాలు..
భారతదేశ బ్యాంకింగ్ రంగం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఏఐ రాకతో టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగితే అది తాజాగా బ్యాకింగ్ రంగానికి కూడా పాకింది. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ కారణంగా భారీ స్థాయిలో లేఆప్స్ చోటు చేసుకుంటున్నాయి. సాధారణ కార్యాచరణ పాత్రలపై బ్యాంకులు ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో ఉద్యోగ కోతలు చేపట్టాయి.
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (FY26) లో ఏకంగా 7,700 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించాయి. సాధారణంగా వ్యాపార వృద్ధికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచే బ్యాంకుల చిరకాల వ్యూహానికి భిన్నంగా.. తక్కువ సిబ్బందితో సాంకేతికత ఆధారంగా ఎక్కువ ఉత్పాదకతను సాధించే దిశగా నడుస్తోంది. బ్యాంకులు తమ రోజువారీ సాధారణ పనులను ఆటోమేషన్ ద్వారా నిర్వహిస్తూ మానవ వనరులను.. కేవలం అమ్మకాలు (Sales), కస్టమర్ సంబంధాల నిర్వహణ (Relationship Management) సలహా సేవల వైపు మళ్లిస్తున్నాయి.

ఈ డిజిటల్ మార్పుకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. తన వార్షిక నివేదిక ప్రకారం.. ఈ బ్యాంకు 2026 ఆర్థిక సంవత్సరంలో 3,343 మంది ఉద్యోగులను తగ్గించి.. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2,11,178కి చేర్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరలో ఈ సంఖ్య 2,14,521 గా ఉంది. అయితే, ఇది కేవలం ఉద్యోగాల కోత మాత్రమే కాదని.. బ్యాంక్ తన ఉద్యోగుల కూర్పులో చేసిన ఉద్దేశపూర్వక మార్పు అని స్పష్టమవుతోంది.
ఎందుకంటే పర్యవేక్షక బాధ్యతలు లేని (Non-supervisory) సాధారణ ఉద్యోగుల సంఖ్య 8 వేల కంటే ఎక్కువగా తగ్గగా, జూనీయర్, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలలో కొత్త నియమకాలు జరిగాయి. దీనిపై బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ మాట్లాడుతూ.. తాము సాంకేతికత-ఆధారిత, వినియోగదారు-కేంద్రీకృత బ్యాంకుగా మారుతున్నామని, అందుకే బ్యాకెండ్ విభాగాల నుండి సిబ్బందిని కస్టమర్లతో నేరుగా వ్యవహరించే పాత్రల్లోకి మారుస్తున్నామని తెలిపారు. ఈ బ్యాంక్ తన అంతర్గత ఏఐ ప్లాట్‌ఫామ్ నీవ్' (Neev) ద్వారా కస్టమర్ సంప్రదింపులు, కార్డ్ ప్రాసెసింగ్, రిస్క్ పర్యవేక్షణ వంటి రంగాలలో ఏఐ వినియోగాన్ని భారీగా విస్తరించినట్లు చెబుతున్నారు.
ఇదే తరహా వ్యూహాన్ని యాక్సిస్ బ్యాంక్ కూడా అమలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు కొత్తగా 400 శాఖలను విస్తరించినప్పటికీ.. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,100 కంటే ఎక్కువగా తగ్గింది. శాఖల విస్తరణ జరిగినా ఉద్యోగుల సంఖ్య తగ్గడం అనేది వ్యాపార మందగమనం వల్ల కాదని, డిజిటలైజేషన్, సాంకేతిక పెట్టుబడుల వల్ల పెరిగిన ఉత్పాదకత వల్లేనని స్పష్టమవుతోంది. సాంకేతికత అనేది కేవలం విస్తరణకే కాకుండా, సమర్థులైన ప్రతిభతో జతకలిసినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) కూడా ఇదే విధానాన్ని బలపరుస్తూ గత సంవత్సరంలో తమ సిబ్బంది సంఖ్యను 1,269 మేర తగ్గించుకుంది. దీంతో ఒక ఏడాది క్రితం 75,323 గా ఉన్న కోటక్ స్వతంత్ర ఉద్యోగుల సంఖ్య మార్చి 31, 2026 నాటికి 74,054కి చేరింది.
ఈ సరికొత్త బ్యాంకింగ్ వ్యూహం కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబిస్తోంది. జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పునరావృతమయ్యే పనులను ఆటోమేటిక్ చేస్తున్నాయి. ఖాతా నిర్వహణ, పత్రాల ధృవీకరణ (KYC), లావాదేవీల ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులు ఆటోమేషన్ పరిధిలోకి వెళ్లడంతో వీటికి డిమాండ్ తగ్గుతోంది.
ఈ పరిణామం పెట్టుబడిదారుల పరంగా బ్యాంకుల నిర్వహణ వ్యయాలను అదుపులో ఉంచి లాభాలను పెంచడానికి సహాయపడుతున్నప్పటికీ.. బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఇది నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. భవిష్యత్తులో కేవలం సాంకేతిక నిపుణులకు, సంపద నిర్వహణ సలహాదారుల వంటి కస్టమర్-కేంద్రీకృత పాత్రలకు మాత్రమే బ్యాంకింగ్ రంగంలో అత్యధిక ఆదరణ ఉండనుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
