US News: H-1B లేదా గ్రీన్ కార్డుతో అమెరికాలో నివసిస్తున్నారా? ట్రంప్ కొత్త సిటిజన్షిప్ రూల్స్ ఎఫెక్ట్స్ ఇవే!
US New Citizenship Rule: అమెరికాలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న పుట్టుకతో అమెరికన్ సిటిజన్షిప్ చట్టానికి చెల్లు చీటీ పలికేందుకు కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో 14వ చట్టసవరణపై అమెరికాలో న్యాయపోరాటం కొనసాగుతోంది.
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో అక్రమంగా చట్టపరమైన పత్రాలు లేకుండా నివసించేవారికి పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం రాకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొత్తగా తీసుకొస్తున్న ఆర్డర్ 30 రోజుల తర్వాత చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చినట్లయితే దశాబ్ధాలుగా కొనసాగుతున్న పద్ధతికి కాలం చెల్లుతుంది. దీంతో ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు సరైన ధృవపత్రాలు లేని దంపతులకు పుట్టే పిల్లలకు పౌరసత్వ పత్రాలను జారీ చేయవు.

వాస్తవానికి 14వ చట్టసవరణను వక్రీకరించారని ట్రంప్ తాజా పౌరసత్వ చట్టమార్పులపై స్పందించారు. అయితే కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ ప్రకారం.. ఇకపై అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించబోరని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బకాయిలో చిక్కుకున్న వారిపై గణనీయమైన ప్రభావాలను చూపుతుందంటున్నారు.
ఇప్పటి వరకు అనేక భారతీయ కుటుంబాలు అమెరికాలో జన్మించిన తమ పిల్లలకు చట్టబద్ధమైన హోదా పొందడానికి, చివరికి వారి తల్లిదండ్రులకు ఇమిగ్రేషన్ అడ్డంకులను అధిగమించడంలో సహాయపడటానికి జన్మతః పౌరసత్వంపై ఆధారపడతున్న సంగతి తెలిసిందే. కానీ ఇకపై అది కుదరదని తెలుస్తోంది.
కొత్త చట్టాల ప్రకారం అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసా అయిన H-1B, డిపెండెంట్ వీసా అయిన H-4పై పనిచేస్తున్న వ్యక్తులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించదు. ఇది ఇప్పటికే అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు జాప్యాలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. చాలా మందికి అమెరికాలో జన్మించిన వారి పిల్లలు యుక్తవయస్సు చేరుకున్న తర్వాత గ్రీన్ కార్డ్ కోసం స్పాన్సర్ చేయగల సామర్థ్యం వారి దీర్ఘకాలిక వలస ప్రణాళికల్లో కీలకమైన భాగంగా ఉంది.
న్యాయ నిపుణుల క్లారిటీ..
ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికాలో తల్లిదండ్రులు ఇద్దరూ వలసేతర వీసాలపై నివసిస్తున్నట్లయితే.. వారి బిడ్డకు ఇకపై అమెరికా పాస్‌పోర్ట్ జారీ చేయబడదు. ఇది చాలా కుటుంబాల్లో కల్లోలానికి కారణంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపై అమెరికాలో నివసిస్తున్న చాలా కుటుంబాలు తమ ఇమ్మిగ్రేషన్ ప్లాన్స్ మారిన రూల్స్ కి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ప్రధానంగా వీసా కాల పరిమితి ముగిసిన పక్షంలో కొత్త కష్టాలు తప్పవని తెలుస్తోంది. న్యాయస్థానంలో ట్రంప్ ఆర్డర్ ఎంతవరకు నిలబడుతుందనే విషయం వేచి చూడాల్సిన జవాబే.


Click it and Unblock the Notifications