PhonePe News: భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ కోట్లమంది ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న యూపీఐ వ్యవస్థ ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంకలో భారత ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తన సేవలను అందించటానికి రంగం సిద్ధం చేసుకుంది.
దేశంలోని టాప్ యూపీఐ చెల్లింపు ఆటగాళ్లలో ఒకరుగా ఉన్న ఫోన్ పే ప్రస్తుతం తన సేవలను పొరుగున ఉన్న శ్రీలంకకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో భాగంగా PhonePe లంకకు చెందిన LankaPay సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో దేశీయ స్టార్టప్ కంపెనీ తన వ్యాపారాన్ని ద్వీపదేశంలోనూ ప్రారంభించింది. ఇకపై భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శించేటప్పుడు సులభంగా LankaPay QR కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

భారతీయులను శ్రీలంక సందర్శించేలా ప్రోత్సహించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఇండియన్ టూరిస్టులు ఇకపై చేతిలో నగదును ఉంచుకోకుండా, ఫారెక్స్ మారకపు ధరల వంటి అంశాలతో సంబంధం లేకుండా చెల్లింపులను సురక్షితంగా, వేగంగా చేయెచ్చని ఫోన్‌పే వెల్లడించింది. వాస్తవానికి కరెన్సీ మారకపు రేటు అనేది ఒక దేశం కరెన్సీని మరొక దేశం కరెన్సీగా మార్చే రేటు. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగంలో ఇది చాలా ముఖ్యమైనది. అయితే వివిధ అంశాల ఆధారంగా మారకపు రేట్లు మారుతూ ఉంటాయి. ఎవరైనా విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు కరెన్సీ మారకపు ధరలను అర్థం చేసుకోవటం చాలా కీలకం.
ఈ చెల్లింపు గందరగోళాల నుంచి ప్రజలకు సహాయం చేయటానికి PhonePe ఇప్పుడు డబ్బు బదిలీని సులభతరం చేసింది. ఇక్కడ ఎవరైనా వ్యక్తి ఫోన్ పే యాప్ ద్వారా LankaPay QR కోడ్‌ని స్కాన్ చేసి, చెల్లింపు చేసినప్పుడు వారి నుంచి మొత్తం డబ్బు భారతీయ కరెన్సీలో డెబిట్ చేయబడుతుంది. అలాగే ట్రాన్సాక్షన్ సమయంలోనే మారకం రేటు కూడా మీకు చూపబడుతుంది. ఇది భారతీయ ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని లంకపే సీఈవో సన్నా డి సిల్వా సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో 2016లో ప్రవేశపెట్టబడిన ఫోన్‌పే యాప్ ప్రస్తుతం 520 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అలాగే 38 మిలియన్ల మంది వ్యాపారులు ఉన్నారు. ఈ డిజిటల్ చెల్లింపు సంస్థ ద్వారా ప్రస్తుతం దాదాపు రోజుకు 230 మిలియన్ల లావాదేవీలు జరుగుతాయి.


Click it and Unblock the Notifications