Jio: అఫ్రికా మార్కెట్ లోకి జియో..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ టెలికాం సంస్థ జియో (Jio) భారతీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. హై-స్పీడ్ 5 జీ ఇంటర్నెట్ సేవలతో దూసుకెళ్తోంది. జియో ఇప్పుడు ఆఫ్రికా మార్కెట్ లో కూడా ప్రవేశించాలని భావిస్తోంది.
ఘనాకు చెందిన నెక్స్ట్-జెన్ ఇన్‌ఫ్రాకో (NGIC) భాగస్వామ్యంతో ఆఫ్రికాపై దృష్టి పెట్టింది. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న తక్కువ-మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థ అయిన ఘనాలో 5Gని విడుదల చేయాలనే దాని ప్రణాళిక కోసం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మద్దతును పొందేందుకు ఎన్జీఐసీ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ విభాగమైన Radisys Corpతో జతకట్టింది.

భారత్‌లో జియో (Jio) అనుసరించిన వ్యూహాన్నే ఘనాలో అమలు చేయాలని ఎన్‌జీఐసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కంపెనీ రిలయన్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, అప్లికేషన్‌లు, కీలకమైన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను కోరుతుంది. ఈ విషయాన్ని వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఇండియాలో జియోను 2016లో ప్రారంభించారు. ఆ తర్వాత జియో ఇండియాలోనే నంబర్ టెలికాం సంస్థగా ఎదిగింది. తక్కువ ధరలకే డేటా సేవలు, ఉచిత వాయిస్ కాలింగ్ వంటి మార్కెటింగ్ వ్యూహాలతో జియో విజయం సాధించింది. దీంతో వోడాఫోన్, ఐడియా - దేశ టెలికాం మార్కెట్లో మనుగడ సాగించడానికి కలిసిపోయాయి. ప్రస్తుతం జియో 470 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో భారతదేశంలో అతిపెద్ద కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 చివరి నాటికి ఘనాలో కార్యకలాపాలను ప్రారంభించాలని జియో యోచిస్తోంది. NGIC రాబోయే 10 సంవత్సరాల పాటు ఘనాలో ప్రత్యేకంగా 5G సేవలను అందించే హక్కును పొందింది.


Click it and Unblock the Notifications