IT News: పొమ్మన్న కంపెనీ కుళ్లుకునేలా భారత టెక్కీ సక్సెస్.. టెస్లాకు మైండ్ బ్లాక్
Indian Techie:సాంకేతిక రంగంలో భారతీయుల ప్రతిభను అంతర్జాతీయ సమాజం ఎప్పుడో గుర్తించింది. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు దిగ్గజ కంపెనీలు తమ సారథిగా ఇండియన్స్‌ను నియమించుకుంటున్నాయి. దీంతో టెక్ మార్కెట్లో భారతీయ యువతకు మంచి డిమాండ్ ఉంది. కాగా ఓ టెక్కీకి ఎదురైన చేదు అనుభవం కాస్తా కోట్లు కుమ్మరించే ఉద్యోగానికి బాటలు వేయడం విశేషం.
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లాలో ఉద్యోగం నుంచి తొలగించబడిన ఓ భారతీయ టెక్కీ.. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం మోటాలో కళ్లు చెదిరే జీతం పొందుతున్నారు. ఏకంగా ఏడాదికి 4 కోట్లు వేతనంగా సంపాదిస్తున్నారు. తన గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో అమెజాన్ ఇంటర్న్‌షిప్ తర్వాత 2018లో టెస్లాలో ఫుల్‌టైమ్ సాఫ్ట్‌వేర్ పాత్రలో చేరినట్లు హేమంత్ పాండే అనే టెక్కీ తన విజయగాథను వివరించారు.

ఎలాన్ మస్క్ కంపెనీలో ఉద్యోగం చేయడం తన కల అని, జీతంతో పాటు జీవితంలోనూ అత్యున్నత స్థాయికి ఎదగాలని కష్టపడినట్లు హేమంత్ చెప్పారు. టెస్లాలో జాబ్ చేస్తున్న సమయంలో తన కెరీర్‌ను చూని ఉప్పొంగిపోయినట్లు గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులను సైతం కాలిఫోర్నియాకు ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే 7 నెలల తర్వాత కంపెనీ తనను తొలగించిందని వెల్లడించారు.
'అది నా మొదటి ఉద్యోగం. తొలగించబడిన కేవలం 6 నెలల్లో మళ్లీ ఇతర కంపెనీలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. నేను మళ్లీ నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది' అని హేమంత్ చెప్పుకొచ్చారు. కాగా మెటాలో క్రేజీ జీతం గురించి తెలుసుకుని 2021లో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హోదాలో ఇప్పుడు 4 కోట్ల వేతనం అందుకుంటున్నారు. లింక్డ్ ఇన్, టిక్ టాక్ వంటి పలు దిగ్గజ కంపెనీల ఆఫర్లను సైతం చేజిక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications