దోసెలు వేయడానికి.. జర్మనీలో లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాన్నివదిలేసిన యువకుడు..
జర్మనీలో మంచి జీతం, అత్యాధునిక టెక్ కంపెనీలో సురక్షితమైన కెరీర్.. ఇది ఎంతోమంది భారతీయ యువకుల కల. కానీ ఒక భారతీయ యువకుడైన మోహన్‌కు ఆ కల అంత ఆసక్తికరంగా అనిపించలేదు. అతని హృదయానికి దగ్గరైనది కోటీశ్వర స్థాయి జీతం కాదు.. తన ఊరి పిల్లగాలి నుంచి తనతో పాటు వచ్చిన దోసె వాసనే. టెక్ ఉద్యోగం ఇచ్చిన సౌకర్యం.. విదేశీ జీవితంలోని భౌతిక సౌకర్యాల కంటే తన మనసులో అల్లుకున్న కల పెద్దదనిపించింది. అదే అభిరుచి చివరకు అతడిని విజయతీరాలకు చేర్చింది. దోసమా అనే ఆహార బ్రాండ్‌ను విదేశాలకు పరిచయం చేసింది.
జర్మనీలో స్థిరమైన కెరీర్‌ను వదిలేయడం విన్నపుడు కొందరికి అది పిచ్చి చర్యలా అనిపించవచ్చు. కానీ మోహన్ మాత్రం తన నమ్మకాన్ని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. పారిస్‌లో స్కాలర్‌షిప్‌పై చదువుకున్న తర్వాత అక్కడే మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే రోజురోజుకు అతనికి ఒకే విషయం స్పష్టమవుతూ వచ్చింది.. తనకంటూ ఏదో ప్రత్యేకంగా నిర్మించాలన్న తపన. చివరకు అతను ధైర్యంగా నిర్ణయం తీసుకొని.. 2023లో తన స్నేహితులతో కలిసి దోసమా అనే బ్రాండ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

దోసమా బ్రాండ్ పేజీలో వైరల్ అయిన వీడియోలో మోహన్ స్వయంగా దోసె బ్యాటర్‌ని రుద్దుతూ.. నైపుణ్యంతో దోసె వేసి దీన్ని చేయడానికి నేను జర్మనీలో నా అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాను" అని చెబుతున్నాడు. ఆ చిన్న వాక్యం వేలాది మందిని కదిలించింది. అతడు తన ప్రయాణం ఎంత కఠినమో కూడా స్పష్టంగా పంచుకున్నాడు. నిద్రలేని రాత్రులు, ఆర్థిక ఒత్తిడి, రాత్రి 3 గంటలకూ కిచెన్‌లో పనిచేయడం, సిబ్బందితో సవాళ్లు, రోజూ కొత్త సమస్యలు. అయితే ఆ ప్రయాణంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పట్టుదల తోడైతే ఏది సాధ్యం కాదని అతడు నిరూపించాడు.
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మొదటి దోసమా అవుట్‌లెట్ ప్రారంభమైంది. అక్కడి ప్రజలు భారతీయ ఆహారం, ముఖ్యంగా గ్లూటెన్-ఫ్రీగా, గట్ హెల్త్‌పై దృష్టి పెట్టి తయారైన దోసెకు ప్రేమగా స్పందించారు. కొద్దికాలంలోనే బ్రాండ్ లండన్‌కు విస్తరించింది. తాజాగా పూణేలోని FC రోడ్డులో కొత్త అవుట్‌లెట్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు దోసమా కథ కేవలం ఒక వ్యాపార ప్రయత్నం కాదు, భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్యమంలా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఆ వీడియో కింద నెటిజన్లు ప్రశంసలతో హోరెత్తించారు. దోసె ఎందుకు రూ. 800 వసూలు చేస్తారంటే? మైదా పిజ్జా కోసం ఎంత తీసుకుంటారో చూసారా? అని ఒక వినియోగదారు చమత్కరించారు. ఈ మనిషి ఆలోచన అద్భుతం. భారతదేశం గర్వించే ఆహారాన్ని ప్రపంచానికి చూపిస్తున్నావు. గర్వంగా ఉంది బ్రదర్ అని మరొక నెటిజన్ తెలిపారు. బిజినెస్ పైన అవగాహన ఉన్న మరో వ్యక్తి బెంగళూరులో దోస జాయింట్ ప్రారంభించాను, మీరు ఎదుర్కొంటున్న ఆపరేషనల్ ఇష్యూస్ బాగా అర్థమవుతున్నాయి. కానీ దృఢంగా ఉండండి, మీరు గ్రేట్ అవుతారని ప్రోత్సాహించాడు. ఇప్పుడు అతని ప్రయాణం అనేకమందికి స్ఫూర్తి, ముఖ్యంగా విదేశాల్లో కలలు కంటూ.. ముందుకు వెళ్లే ధైర్యం చేయలేని వారికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications