IT News: ఐటీ ఉద్యోగులకు కొత్త శాపం.. తలలు పట్టుకుంటున్న టెక్కీలు..!
IT News: సాఫ్ట్ వేర్ కొలువు అంటే అంత సులువు కాదు. కొంద మంది వీరిని చూసి కూర్చుని లక్షలు వేతనంగా అందుకుంటున్నారంటూ భావిస్తుంటారు. అయితే దాని వెనుక ఉండే శ్రమ గురించి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయరు.
అసలే టైమ్ బాగోలేదు. ప్రపంచంలో ఏ మూలన విన్నా ఐటీ రంగంలో మందగమనం వల్ల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయనే వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని చాలా మంది భారతీయ టెక్కీలు మాత్రం అలుపెరగక పనిచేస్తున్నారు. ఇది వారిపై అధిక పని భారాన్ని పెంచుతోందని ఇటీవల తెలుస్తోంది. సాధారణంగా పనిగంటల కంటే రెండు మూడు గంటలు అధికంగా పనిచేయాల్సి వస్తోందని కొందరు టెక్ ఉద్యోగులు చెబుతున్నారు.

దీనికి అసలు కారణం కంపెనీల ప్రాజెక్టుల డెడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగులు పనిచేయాల్సి రావటమే. ఈ క్రమంలో సగటన వారానికి 50 నుంచి 60 గంటల మధ్య ఉద్యోగులు తమ వృత్తి కోసం సమయాన్ని కేటాయిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 10 గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం ఉద్యోగంలో గడుపుతున్నారు. వాస్తవానికి దేశంలోని కార్మిక శాఖ చట్టాల ప్రకారం 8 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంది. కానీ వాస్తవానికి ఐటీ రంగంలోని కొందరు ఉద్యోగులు మాత్రం దాదాపు 3 నుంచి 4 గంటలు అధికంగా సమయాన్ని రోజూ ఆఫీసుల కోసమే అధికంగా వెచ్చిస్తున్నారు.
ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక మందగమనంలో కొత్త ఉద్యోగాలు లేకపోవటం, కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయటంతో జాబ్ మారాలనే ఆలోచన సైతం చాలా మంది టెక్కీలను భయపెడుతోంది. ప్రస్తుతం కంపెనీలు తమ ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు ద్వారా ఎక్కువే రాబడిని పొందుతున్నట్లు తాజా గణాంకాలు బయటపెట్టాయి. దేశంలోని కొన్ని టెక్ కంపెనీలు ఉద్యోగి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోగా.. కొన్ని దిగ్గజ కంపెనీల విషయంలో మాత్రం అది తగ్గింది. అంటే పెద్ద కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయని, ఆదాయాలు తగ్గుతున్నాయని ఇది సూచిస్తోంది. దీంతో ఆ ప్రభావం పరోక్షంగా కొంత ఉద్యోగులకు పని ఒత్తిడి రూపంలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications